
ఇంటింటి సర్వే చేపట్టాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని శిథిలావస్థలోని ఇళ్లు, వాణిజ్య భవన సముదాయాలను గుర్తించేందుకు పట్టణంలో ఇంటింటి సర్వే చేపట్టాలని టీపీఓ లక్ష్మీపతి, ఆర్‌ఓ మహమ్మద్ ఖాజా సూచించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కౌన్సిల్ సమావేశ మందిరంలో వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెల్లార్లలో విద్యుత్ మీటర్లు ఉన్న అపార్ట్‌మెంట్‌లతో పాటు ఎక్కడెక్కడ కూలిపోయే దశలో ఇళ్లు, పెద్ద భవనాలు ఉన్నాయో వివరాలు సేకరించాలన్నారు. ఇందులో భాగంగా వాటికి ప్రమాద హెచ్చరికలతో కూడిన స్టిక్కర్లు అంటించాలన్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు సెల్లార్లలో నీరు నిండితే వెంటనే భవన యజమానులే మోటార్లతో తోడివేయాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో ఆర్‌ఐలు ముజీబ్, రమేష్, అహ్మద్‌షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ముంబైలో గాలి వానకు ఓ పెట్రోల్ బంక్‌పై భారీ హోర్డింగ్ కూలిన నేపథ్యంలో.. మున్సిపల్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని 125 హోర్డింగ్‌ల పరిస్థితులు ఎలా ఉన్నాయో? తెలియజేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను టీపీఓ నివేదిక అడిగారు.
శిథిలావస్థలోని ఇళ్లు,
వాణిజ్య భవనాలు గుర్తించాలి
టీపీఓ లక్ష్మీపతి, ఆర్‌ఓ మహమ్మద్ ఖాజా