
పనులు వేగంగా చేయిస్తున్నాం: కలెక్టర్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాలో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కలెక్టర్ జి.రవికుమార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి సీఎస్ శాంతికుమారి ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బదులిస్తూ ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు, తాగునీరు, తరగతి గదుల మరమ్మతు పనులు వేగంగా చేయిస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో రైస్ మిల్లులకు తరలిస్తున్నామన్నారు. సీఎంఆర్ బియ్యం త్వరితగతిన పంపిణీ చేస్తామన్నారు. వీసీలో కలెక్టరేట్ నుంచి స్థానిక సంస్థల, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్లు శివేంద్రపత్రాప్, మోహన్‌రావు తదితరులుపాల్గొన్నారు.
పాఠశాలల్లో పనులు వేగిరం చేయాలి
జడ్చర్ల టౌన్: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేసి జూన్ 12 నాటికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ రవినాయక్ ఆదేశించారు. శుక్రవారం మండలంలోని గంగాపురం జెడ్పీ హైస్కూల్‌లో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను ఆయన పరిశీలించారు. పాఠశాలల్లో చేపట్టిన మౌళిక వసతుల కల్పన, మరమ్మతు పనులను త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. ఈ సందర్భంగా హౌజింగ్ ఏఈ కుమార్‌ను అడిగి పనుల వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి మండలంలోని అన్ని అమ్మ ఆదర్శ పాఠశాలల్లోనూ పనులు పూర్తిచేయించాలని చెప్పా రు. అలాగే పాఠశాలలో కొనసాగుతున్న ఎలక్ట్రిఫికేషన్, టాయిలెట్ పనుల గురించి ఆరాతీశారు. ఆయన వెంట డీఈఓ రవీందర్, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ కన్వీనర్లు ఉన్నారు.
తడిసిన ధాన్యాన్నిత్వరగా తరలించాలి
మిడ్జిల్: ఆకాల వర్షం వల్ల తడిసిన వడ్లను త్వరగా నింపి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సింగిల్‌విండో అధికారులను కలెక్టర్ రవినాయక్ ఆదేశించారు. శుక్రవారం మిడ్జిల్ మండల పరిధిలోని రాణిపేటలో ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన వరి ధాన్యంను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, ధాన్యాన్ని వెంటనే తరలించాలని సూచించారు. అనంతరం వస్పులలో పాఠశాలలను సందర్శించి.. అక్కడ జరుగుతున్న నిర్మాణాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు త్వరగా పూర్తి చేయాలని, నిర్లక్ష్యం చేస్తు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట డీఈఓ రవీందర్, తహసీల్దార్ రాజునాయక్, ఎంపీడీఓ గీతాంజలి, తదితరులున్నారు.