మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–14 బాల, బాలికలు, సోమవారం ఉమ్మడి జిల్లా అండర్–17 విభాగం బాల, బాలికల అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రమేశ్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు విద్యార్థులు రిపోర్టు చేయాలని కోరారు. అండర్–14 విభాగం వారికి 100 మీ., 200 మీ., 400 మీ., 600 మీటర్ల పరుగుతోపాటు లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్, డిస్కస్‌త్రో, అండర్–17 వారికి 100 మీ., 200 మీ., 400 మీ., 800 మీ., 1500మీ., 3వేల మీటర్ల పరుగుతోపాటు లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్, డిస్కస్‌త్రో, జావెలిన్‌త్రో, హ్యామర్‌త్రో, 5 కి.మీ., 3 కి.మీ., వాకింగ్ అంశాల్లో ఎంపికలు ఉంటాయన్నారు. విద్యార్థులు పాఠశాల బోనోఫైడ్, ఆధార్‌కార్డుతో హాజరుకావాలని, పూర్తి వివరాల కోసం సెల్ నంబర్లు 94401 60104, 98497 06360 సంప్రదించాలని సూచించారు.
కోయిల్‌సాగర్‌లో 32.2 అడుగుల నీటిమట్టం
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం శనివారం సాయంత్రం వరకు 32.2 అడుగులకు చేరుకుంది. జూరాల నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని కోయిల్‌సాగర్‌కు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. ప్రస్తుతం 0.4 ఇంచులు తక్కువగా ఉంది. దీంతో జూరాల నుంచి నీటి విడుదలను శనివారం నిలిపివేశారు. ఈ ఏడాది యాసంగి పంటలకు నీటిని వదిలే విషయం ఇంకా అధికారులు ప్రకటించలేదు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టు నీటిని వేసవిలో తాగునీటి కోసం ఉపయోగించే అవకాశం ఉన్నట్లు అధికారులు గతంలో పేర్కొన్నారు.