
మాట్లాడుతున్న మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి
సాక్షి, నాగర్‌కర్నూల్: ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఎక్కడ భూసేకరణ చేపట్టినా రైతులకే తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీమంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆయన నివాసంలో గురువారం నిర్వహించిన విలేరుల సమావేశంలో మాట్లాడారు. కుమ్మెరలోని సర్వే నంబరు 15లో రైతు అల్లోజీ కుటుంబం నుంచి సేకరించిన ఐదెకరాల భూమికి రిజర్వాయర్ ముంపుతో సంబంధం లేదని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రాజెక్టు అవసరానికి మించి భూమిని ఎందుకు బలవంతంగా సేకరిస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అల్లోజీ కుటుంబం తమకు 5 ఎకరాల భూమిని అప్పగించాలని హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో బెదిరించడం దుర్మార్గమని చెప్పారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి రైతులపై ప్రేమ ఉంటే అఽధికారుల సమక్షంలో మాట్లాడాలి కానీ ఆయన ఇంట్లో సెటిల్‌మెంట్ చేస్తారా? అని ప్రశ్నించారు. రూ.లక్షల విలువైన భూమికి ఎకరాకు రూ. 2.04 లక్షలు ఇవ్వడం ఎక్కడా లేదన్నారు. రైతు అల్లోజీ ఆత్మహత్య చేసుకుంటే స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఏమీ పట్టడం లేదని విమర్శించారు. వారి వల్లే అమాయకుల ప్రాణాలు పోతున్నాయని ఆరోపించారు. అల్లోజీ ఆత్మహత్య ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత రైతు కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని, అల్లోజీ కూతురు, కుమారుడి చదువుకు అవసరమైన ఖర్చును తాము భరిస్తామని హామీ ఇచ్చారు. ఉయ్యాలవాడ సమీపంలోనూ పేదలకు దక్కాల్సిన భూమిని ఎకరం రూ.5 లక్షలకే బలవంతంగా లాక్కున్నారని చెప్పారు. సుమారు 40 ఏళ్లుగా సాగులో ఉన్న దళితులకు ఆ భూమిపై పూర్తి హక్కులు ఉన్నాయన్నారు. ప్రాజెక్టు టన్నెల్, రిజర్వాయర్లు, మెడికల్ కళాశాల పేరుతో ప్రజాప్రతినిధులు, అధికారులు అవసరానికి మించి భూమిని రైతుల నుంచి సేకరిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు బాలాగౌడ్, శశిధర్‌రెడ్డి, అర్థం రవి, లక్ష్మయ్య, రాములు, పాండు పాల్గొన్నారు.
అల్లోజీ మరణంపై
న్యాయవిచారణ చేపట్టాలి
బాధ్యులపై
చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి