
శతాధిక వృద్ధుడు మృతి
కొత్తకోట రూరల్: మండల కేంద్రంలోని 12వ వార్డులోని విద్యానగర్ కాలనీకి చెందిన వయోవృద్ధుడు బకెట పెద్ద బాలయ్య (104) వృద్ధాప్యంతో బాధపడుతూ బుధవారం ఉదయం మృతి చెందారు. 1921లో జన్మించిన పెద్ద బాలయ్య పట్టణంలోనే కాక మండలంలోనే అత్యధిక వయస్సు గల వ్యక్తిగా జీవించారు. బాలయ్య మృతి విషయం తెలుసుకున్న పట్టణానికి చెందిన పలువురు నాయకులు నివాళులర్పించారు. నివాళ్లు అర్పించిన వారిలో బీఆర్‌ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు గౌనికాడి రాములు యాదవ్, లాల్‌కోట రవి, పీఏసీఎస్ డైరెక్టర్ చాపల భాస్కర్, గట్టున్న, చిలుకటి బుచ్చన్న తదితరులు ఉన్నారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
నాగర్‌కర్నూల్ క్రైం: కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్కపల్లి మండలంలోని గట్టురాయిపాకుల గ్రామానికి చెందిన చటమోని రాములు (38) వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రం నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తున్న రాములును కొల్లాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద కారు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బుధవారం జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోవర్ధన్ తెలిపారు.
న్యాయం చేయాలని ధర్నా
కారు ఢీకొన్న ఘటనలో మృతి చెందిన చటమోని రాములు కుటుంబానికి న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులతో పాటు ఆయా రాజకీయ పార్టీల నాయకులు బుధవారం మధ్యాహ్నం జనరల్ ఆస్పత్రి ఎదుట ఽరాస్తారోకో నిర్వహించారు. దీంతో గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న సీఐ కనకయ్యగౌడ్ అక్కడికి చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. పలువురు మాట్లాడుతూ మృతుడిని ఢీకొన్న కారులో బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్‌ప్రసాద్ ఉన్నప్పటికీ తీవ్రంగా గాయపడిన చటమోని రాములును పరామర్శించకుండా వెళ్లడం దారుణమని మండిపడ్డారు.
ఎద్దు పొడవడంతో
వ్యక్తి మృతి
మానవపాడు: ఎద్దులను కళ్లెంలో కట్టెయడానికి వెళ్లగా ఓ ఎద్దు పొడవడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని జల్లాపురంలో బుధవారం చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు.. మానవపాడు మండలం జల్లాపురానికి చెందిన చిన్న గోపాల్‌నాయుడు (72) ఈ నెల 17న ఎద్దులను కట్టెయడానికి కళ్లానికి వెళ్లాడు. ఈ క్రమంలో గోపాల్‌నాయుడు కాలుకు తాడు చుట్టుకొని ఉండగా ఓ ఎద్దు వచ్చి అతడిని పొడిచింది. తీవ్రగాయాలు కాగా కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
ప్రసవ వేదనతో ప్రాణాలు కోల్పోయిన బాలింత
వీపనగండ్ల: మండలంలోని గోపల్‌దిన్నె గ్రామానికి చెందిన జ్యోతిబాయి (30) మూడు రోజులుగా ప్రసవ వేదనతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. జ్యోతిబాయి మూడో కాన్పు కోసం వనపర్తి ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు ఆమెను హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రసవం అయిన కొద్దిసేపటికే పసిబిడ్డ చనిపోగా.. రెండు రోజులు చికిత్స పొందిన తర్వాత బాలింత జ్యోతిబాయి కూడా మృతి చెందింది. చికిత్స కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసినా భార్య, కుమార్తె మృతి చెందారని మృతురాలి భర్త శివాజీ వాపోయారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
కసాయి తల్లికి రిమాండ్
లింగాల: మండలంలోని చెన్నంపల్లికి చెందిన మేకల ఎల్లమ్మను బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్‌గౌడు తెలిపారు. ఈ నెల 20న ఎల్లమ్మ తన చిన్న కూతురు నవిత(6)ను నీటి సంపులో వేయడంతో మృతి చెందిన విషయం విధితమే. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ రవీందర్, ఎస్‌ఐ వెంకటేశ్వర్‌గౌడ్ ఎల్లమ్మను అదుపులోకి తీసుకొని కొల్లాపూర్ కోర్టులో హాజరు పరిచగా రిమాండ్ విధించడంతో మహబూబ్‌నగర్ జైలుకు తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

శతాధిక వృద్ధుడు మృతి

శతాధిక వృద్ధుడు మృతి