నారాయణపేట: డెలవరి కోసం ఆస్పత్రికి వచ్చిన బాలింత బాత్‌రూంలో జారిపడి మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. మక్తల్ మండలం మాద్వార్‌కు చెందిన మురళికి ఏడేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రానికి చెందిన స్వాతితో వివాహమైంది. చాలా కాలం తర్వాత గర్భం దాల్చిన భార్యను కాన్పు కోసం నారాయణపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి సోమవారం తీసుకొచ్చారు. మంగళవారం సిజేరిన్ చేయగా, ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పర్యవేక్షణ నిమిత్తం ఆస్పత్రిలోనే ఉండగా, గురువారం ఉదయం బాత్‌రూంకు ఎవరి సహాయం లేకుండా వెళ్లిన ఆమె.. ప్రమాదవశాత్తు జారి పడింది. అటువైపు వెళ్లిన వారు గమనించి కుటుంబ సభ్యులకు తెలపగా ఆమెను ఎత్తుకుని బెడ్ వరకు తీసుకొచ్చి వైద్యులను సంప్రదించారు. తీవ్ర రక్తస్రావం వల్ల పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. అంబులెన్స్‌లో తరలిస్తుండగా, మార్గమధ్యలో ఆమె మృతి చెందింది. ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద మనుషులు వారిని సముదాయించి పంపించారు.