
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన టెట్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం పేపర్–1 రాసేందుకు వచ్చిన పలువురు అభ్యర్థులు పరీక్షకేంద్రాల చిరునామా తెలియక హడావుడిగా పరుగులుపెట్టిన దృశ్యాలు కన్పించాయి. కేంద్రాల వద్ద సరైన వసతులు లేకపోవడంతో చిన్నచిన్న పిల్లలున్న అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. కలెక్టర్ రవినాయక్ జిల్లాకేంద్రంలోని ఎన్‌టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల, ఫాతిమా విద్యాలయంలోని కేంద్రాలను పరిశీలించారు. డీఈఓ రవీందర్‌తో పాటు పలువురు జిల్లా అధికారులు 13 మంది స్వ్కాడ్ బృందాలు పలు కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పేపర్–1కు మొత్తం 18,566 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా..15,631 మంది మాత్రమే పరీక్ష రాశారు. 2,932 మంది గైర్హాజరయ్యారు. పేపర్–2కు 13,582 మంది హాజరుకావాల్సి ఉండగా 12,517 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా.. 1,067 మంది గైర్హాజరయ్యారు.
భారీ పోలీస్ భద్రత
మహబూబ్‌నగర్ క్రైం: టెట్ నిర్వహణకు పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. ప్రతి కేంద్రం దగ్గర ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ మహిళా కానిస్టేబుల్‌తో పాటు ప్రతి మూడు కేంద్రాలకు ఒక ఎస్‌ఐతో మొత్తం 190 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించారు. కేంద్రాల దగ్గర విధులు నిర్వహించారు. పెట్రోలింగ్‌లో భాగంగా సీఐ స్థాయి అధికారులు పర్యవేక్షించారు. జిల్లాకేంద్రంలోని ఎన్‌టీఆర్ మహిళ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ కె.నరసింహ, డీఎస్పీ టి.మహేష్ తనిఖీ చేయడం జరిగింది.
పేపర్–1కు 15,631 మంది, పేపర్–2కు 12,517మంది హాజరు

ఎన్‌టీఆర్ డిగ్రీ కళాశాలలో పరిశీలిస్తున్న ఎస్పీ కె.నరసింహ