
కొల్లాపూర్‌లో సీఎం సభావేదికను పరిశీలిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు
కొల్లాపూర్: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబురానికి సర్వం సిద్ధమైంది. శనివారం సీఎం కేసీఆర్ ప్రాజెక్టులోని ఒక మోటారును ప్రారంభించనుండగా.. ఇందుకు సంబంధించి నీటి పారుదల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎల్లూరు పంప్‌హౌస్‌లో సీఎం కేసీఆర్ స్విచ్ ఆన్ చేయనున్న ప్యానెల్ బోర్డును ప్రత్యేకంగా అలంకరించారు. పంప్‌హౌస్ వద్ద పైలాన్ ఏర్పాటు చేశారు. నార్లాపూర్ రిజర్వాయర్‌లోని నీటిని ఎత్తిపోసే డెలివరీ పంపింగ్ సిస్టం వద్ద సీఎం కృష్ణమ్మకు పూజలు చేయనున్నారు. ఈ క్రమంలో దేవతామూర్తులను అభిషేకించడానికి సహస్ర కళశాలతో కృష్ణానీటిని నింపి పూజలు చేయనున్నారు. శుక్రవారం రాత్రే సహస్ర కళశాలను లింగాకరం, ఓంకారం, స్వస్తిక్ రూపాలలో అలంకరించారు. కొల్లాపూర్‌లో సభావేదిక ప్రాంగణం నిర్మాణ పనులు సైతం కొనసాగాయి. పనులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి పరిశీలించారు. కలెక్టర్ ఉదయ్‌కుమార్ పోలీసు, ఇతర శాఖల అధికారులతో సమావేశమై.. బందోబస్తు తదితర అంశాల గురించి చర్చించారు. సుమారు 3 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొననుండగా.. వెయ్యిమందికిపైగా ఇతర శాఖల అధికారులు విధుల్లో ఉంటారు. ఏర్పాట్ల పర్యవేక్షణ అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ కొల్లాపూర్ చేరుకుని.. నేరుగా పాలమూరు ప్రాజెక్టు పంప్‌హౌస్‌లో స్విచ్ ఆన్ చేసి వెట్‌రన్ ప్రారంభిస్తారన్నారు. నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద పూజలు చేసిన అనంతరం కొల్లాపూర్‌లో బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. సభకు హాజరయ్యే వారికి పార్కింగ్‌లో ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాల వారీగా స్థలాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మంత్రి వెంట నాయకులు రంగినేని అభిలాష్‌రావు, రఘువర్ధన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి తదితరులున్నారు.
కొల్లాపూర్‌లో సభావేదికను
పరిశీలించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్

పాలమూరు ప్రాజెక్టు పంప్‌హౌస్‌లో కేసీఆర్ ప్రారంభించనున్న మొదటి పంపు స్విచ్‌బోర్డు