
వీఆర్‌ఏ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న జేఏసీ నాయకులు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రభుత్వం వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వీఆర్‌ఏల ఉసురు తీస్తుందని జేఏసీ జిల్లా చైర్మన్ రామచంద్రయ్య అన్నారు. గుండెపోటుతో మృతిచెందిన మహమ్మదాబాద్ మండలం రంగారెడ్డిపల్లికి చెందిన వీఆర్‌ఏ బాలయ్య మృతి పట్ల సంతాపం తెలిపారు. సోమవారం గ్రామానికి వచ్చి బాలయ్య మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పే స్కేల్ ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడంతో వీఆర్‌ఏలు గుండె పగిలి చనిపోతున్నారని ఆరోపించారు. కాలయాపన చేయడంతో వీఆర్‌ఏలు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించుకోలేని దుస్థితికి చేరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఎందరో వీఆర్‌ఏలు మృతిచెందుతున్నారని వాపోయారు. బాలయ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ మొదటి వారం వరకు వేచి చూస్తామని అనంతరం పే స్కేల్ జీఓ రాకపోతే మరో పోరాటం చేసేందుకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా కో కన్వీనర్ హన్మప్ప, మహమ్మదాబాద్ మండల చైర్మన్ గంగాధర్, కోచైర్మన్ హర్షవర్ధన్, గండేడ్ మండల చైర్మన్ నర్సింహులు, కో చైర్మన్ సత్తయ్య తదితరులున్నారు.