
జోగుళాంబ అమ్మవారి దర్శనానికి వెళ్తున్న ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి
అలంపూర్/జోగుళాంబ శక్తిపీఠం: నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్సీ హోదాలో తొలిసారిగా జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయాలను దర్శించుకున్నారు. ఆలయ ఈఓ పురేందర్‌కుమార్, చైర్మన్ బెక్కం శ్రీనివాస్ రెడ్డి అర్చకులతో కలసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అర్చకులు వారికి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. అనంతరం శేషవస్త్రాలతో పాటు అమ్మవారి జ్ఞాపికను అందజేశారు.
శక్తివంచన లేకుండా పనిచేస్తా..
సీఎం కేసీఆర్ నాపై పెట్టిన బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని ఎమ్మెల్సీ అన్నారు. అలంపూర్ క్షేత్రాన్ని దర్శించుకున్న అనంతరం స్థానిక టూరిజం హోటల్ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు పేర్కొన్నారు. సీఎం సహకారంతో అలంపూర్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. ప్రధానంగా ఆర్డీఎస్ సమస్య పరిష్కారం, జోగుళాంబ అమ్మవారి క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు. పురావస్తు శాఖ అధికారులతో మాట్లాడి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆర్డీఎస్ ద్వారా నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీళ్లందించాలనే లక్ష్యం ఉందన్నారు. దీంతో పాటు నెట్టంపాడు, జూరాల ప్రాజెక్టుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. అలంపూర్–ర్యాలంపాడు మధ్య తుంగభద్ర నదిపై నిర్మించిన బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. ఆస్పత్రిని అభివృద్ధి చేయడానికి మంత్రి కేటీఆర్‌కు ప్రతిపాదనలు చేసిన విషయం తమ దృష్టిలో ఉందన్నారు. అలంపూర్‌తోపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి తోడ్పాటును అందిస్తామన్నారు. పట్టణంలో గతంలో డ్రైవర్లు, వరద బాధితులకు ఇచ్చిన ప్లాట్ల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి
జోగుళాంబ ఆలయంలో
ప్రత్యేక పూజలు
ఎమ్మెల్సీని కలిసిన నాయకులు
ఎమ్మెల్సీగా ఎన్నికై న చల్లా వెంకట్రామిరెడ్డిని నియోజకవర్గంలోని ఆయా మండలాల నాయకులు కర్నూలులోని ఆయన నివాసంలో శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాలు, గజమాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.