● వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం : ఆరోగ్యవంతమైన జీవనం కోసం ప్రతి ఒక్కరూ నిత్యం యోగా సాధన చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. ఆదివారం వరంగల్ కమిషనరేట్‌లోని పరేడ్ మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కమిషనరేట్‌కు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. సీపీ ముఖ్య అతిథిగా పాల్గొని యోగా, ధ్యాన సాధన చేశారు. ఈ సందర్భంగా సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. నిత్యం విధి నిర్వహణలో భాగంగా ఎన్నో ఒత్తిళ్లకు గురయ్యే పోలీసులకు యోగా ఓ దివ్య ఔషధమని వివరించారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసినందుకు భారతీయులుగా మనం గర్వపడాల్సి ఉంటుందని తెలిపారు. ‘పచ్చదనం–దేశభక్తి–క్రమ శిక్షణ’ అనే మూడు విలువలను ప్రతిబింబించేలా పచ్చని మొక్కలతో ఏర్పాటు చేసిన డ్రోన్ కెమెరా దృశ్యాలు ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, అదనపు డీసీపీలు సురేష్‌కుమార్, శ్రీనివాస్ యోగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ప్రతినిధి శోభ, ధ్యాన శిక్షకురాలు మాధవితో పాటు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


