మహబూబాబాద్ రూరల్ : ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. టౌన్ ఎస్సై శివరామకృష్ణ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని బెస్త బజారుకు చెందిన దుగ్గి మురళి (30) స్థానిక వస్త్ర దుకాణంలో పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం పనికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. అదే రోజు రాత్రి 10 గంటలు దాటినా అతడు ఇంటికి రాకపోవడంతో తల్లి పద్మ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే అతడు పనిచేసే షాపు యజమానికి ఫోన్ చేసి అడగగా మురళి బుధవారం షాపునకు రాలేదని చెప్పాడు. దీంతో మురళి ఆచూకీ కోసం తల్లి చుట్టుపక్కల వారికి, తెలిసిన వారికి చెప్పగా ఎలాంటి సమాచారం లభించలేదు. ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వ బాలుర కళాశాల సమీపంలో గల బావిలో ఒకరు మృతి చెంది ఉన్నట్లుగా స్థానికులు చెప్పారు. దీంతో పద్మ, ఆమె చిన్నకుమారుడు సురేష్ అక్కడికి వెళ్లి పరిశీలించి చూశారు. మృతిచెందిన వ్యక్తి మురళిగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టంకు మృతదేహాన్ని తరలించారు.


