అర్హత లేకున్నా అందలం! | - | Sakshi
Sakshi News home page

అర్హత లేకున్నా అందలం!

Jun 22 2026 1:12 AM | Updated on Jun 22 2026 1:12 AM

14 ఏళ్లలో రెండుసార్లు

అక్రమ పదోన్నతి..

హన్మకొండ చౌరస్తా: ‘వడ్డించే వాడు మనోడైతే .. పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఒకటే’ అనే సామెత వరంగల్‌ ప్రభుత్వ ఐటీఐ అధికారులకు సరిగ్గా సరిపోతుంది. జీఓలు, నిబంధనలను పక్కనపెట్టి మరీ ఓ ఉద్యోగికి పదోన్నతి కల్పించారు. అలా ఒకే వ్యక్తికి రెండు పర్యాయాలు పదోన్నతి కల్పించి మనవాడేనని అనిపించుకున్నారు. ఇదేమని నిలదీస్తే అ తడికి అన్ని అర్హతలు ఉన్నాయంటూ బుకాయించా రు. అనుమానం వచ్చిన సహచర ఉద్యోగులు స మాచార హక్కు చట్టం ద్వారా అక్రమ పదోన్నతి పొ ందిన ఉద్యోగి చిట్టాను బయటికి తీశారు. న్యాయంగా తమకు రావాల్సిన పదోన్నతిని అక్రమంగా మరొకరికి కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

జీఓ 23కు విరుద్ధంగా..

ఐటీఐలో ఉద్యోగులు డిప్యూటీ ట్రైనింగ్‌ ఆఫీసర్‌, ట్రైనింగ్‌ ఆఫీసర్లుగా పదోన్నతి పొందాలంటే 24 జూన్‌ 1995లో ప్రభుత్వం జీఓ 23ను విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం డీటీఓ, టీఓగా పదోన్నతి పొందాలంటే హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా ఏడాది పాటు శిక్షణ పొందాలి. అందులో పొందుపరిచిన 5 సబ్జెక్టుల్లో సెమిస్టర్‌ ప్రకారం ఉత్తీర్ణత సాధిస్తే నేషనల్‌ క్రాఫ్ట్‌ ఇన్‌స్ట్రక్టర్‌ సర్టిఫికెట్‌ను అందిస్తారు. ఆ సర్టిఫికెట్‌ను పొందిన వ్యక్తికి మాత్రమే సీనియారిటీ, మెరిట్‌ ఆధారంగా పదోన్నతి కల్పించాలని జీఓ స్పష్టంగా చెబుతుంది.

టెక్నికల్‌ అసిస్టెంట్‌ నుంచి ట్రైనింగ్‌ ఆఫీసర్‌గా..

హనుమకొండకు చెందిన ఓ వ్యక్తి హనుమకొండ ములుగురోడ్డులోని ప్రభుత్వ ఐటీఐలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా 1999లో కొలువులో చేరాడు. మూడు సంవత్సరాల పాటు ఇక్కడే విధులు నిర్వహించాడు. 2003లో అసిస్టెంట్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్‌గా పదోన్నతిపై మహబూబ్‌బాద్‌కు బదిలీపై వెళ్లాడు.

2019లో మరోసారి పదోన్నతి..

అప్పటికే సీటీఐ పాస్‌ కాకుండానే డిప్యూటీ ట్రైనింగ్‌ ఆఫీసర్‌గా అక్రమ పదోన్నతి పొందిన సదరు ఉద్యోగికి 2019లో ట్రైనింగ్‌ ఆఫీసర్‌గా మరోసారి పదోన్నతి కల్పించారు. ఇప్పుడు కూడా సెంట్రల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా సంవత్సరం శిక్షణ పొంది ఉత్తీర్ణత సాధించాలి. అయితే సెమిస్టర్‌ పద్ధతులను పక్కనపెట్టి మాడ్యులర్‌గా మార్కులను ఆధారంగా చూపించి పదోన్నతి పొందాడు.

ఇద్దరితో కూడిన కమిటీ విచారణ..

సదరు ఉద్యోగి అక్రమంగా పదోన్నతి పొందడంటూ సహచర ఉద్యోగులు సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకొచ్చిన ఆధారాలను ఐటీఐ ఆర్‌డీడీ ముందుంచారు. దీంతో పూర్తి విచారణ కోసం ఇద్దరితో కూడిన కమిటీని నియమించారు. విచారణ చే సిన కమిటీ సైతం సీటీఐగా ఉత్తీర్ణత సాధించలేదని, అతడు అక్రమంగా పదోన్నతి పొందాడని 2024 ఏప్రిల్‌ 8న నివేదిక అందజేసి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. స్పందించిన కలెక్టర్‌ వివరణ కోరగా సదరు ఉద్యోగి ఇచ్చిన వివరణతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్‌కు సూచించారు.

డైరెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తాం..

అక్రమ పదోన్నతి లాంటి అంశాలపై లిఖిత పూర్వకంగా ఇస్తే పరిశీలిస్తాం. మా ఉన్నతాధికారులు డైరెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి శాఖాపరమైన చర్యలు తీసుకునేలా చూస్తాను. పదోన్నతులే కాకుండా ఎలాంటి అక్రమాలు జరిగినా పూర్తి ఆధారాలతో మా దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకోవడానికి మేము, మాపై అధికారులు ఎప్పుడు సిద్ధమే.

– రాజా, ఆర్‌డీడీ, ఐటీఐ వరంగల్‌

మహబూబాబాద్‌లో ఏటీఐగా కొన్ని సంవత్సరాలు విధులు నిర్వర్తించిన సదరు ఉద్యోగి 2012లో ఉట్నూరు ఐటీఐలో డిప్యూటీ ట్రైనింగ్‌ ఆఫీసర్‌గా కండీషన్‌తో పదోన్నతిపై వెళ్లాడు. సెంట్రల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉత్తీర్ణత సాధించకపోతే ప్రమోషన్‌ రివర్షన్‌ చేస్తామని కండీషన్‌లో పేర్కొన్నారు. కేవలం మూడు నెలలు శిక్షణకు హాజరైన ఉద్యోగి ఉన్నతాధికారులకు మాత్రం శిక్షణ పూర్తయినట్లు తప్పుడు నివేదిక అందజేశారు. నివేదికను అధికారులు పట్టించుకోకుండా 2012లో ఉట్నూరు ఐటీఐలో డిప్యూటీ ట్రైనింగ్‌ ఆఫీసర్‌గా పదోన్నతి కల్పించారు.

ప్రభుత్వ ఐటీఐలో అక్రమ పదోన్నతి

ఆర్‌టీఐ చట్టం ద్వారా వెలుగులోకి

తమకు అన్యాయం చేశారని

సహ ఉద్యోగుల ఆవేదన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement