వరంగల్‌ ఆర్వోపై విజిలెన్స్‌ ఆరా! | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌ ఆర్వోపై విజిలెన్స్‌ ఆరా!

Jun 22 2026 1:12 AM | Updated on Jun 22 2026 1:12 AM

కాజీపేట అర్బన్‌: వరంగల్‌ ఆర్వో రిజిస్ట్రేషన్‌ కార్యాలయంపై విజిలెన్స్‌ అధికారులు ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏసీబీ దాడులు జరిగి ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లు సస్పెన్షన్‌కు గురైన కూడా వరంగల్‌ ఆర్వో తీరు మారలేదని, అక్రమ వసూళ్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని తెలిసింది. కొంతమంది రాత్రి వేళ సైతం కార్యాలయంలోనే తిష్టవేసి ఉంటున్నట్లు సమాచారంతో నిఘా పెంచినట్లు వినికిడి.

విష ఆహారం తిని కోళ్లు మృత్యువాత!

నర్సంపేట రూరల్‌ : విష ఆహారం తిని 500 కోళ్లు మృతిచెందిన సంఘటన నర్సంపేట పట్టణంలోని నాగుర్లపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. మాధన్నపేటకు చెందిన కందికొండ సదానందం కొన్ని నెలలుగా నాగుర్లపల్లి శివారులో నాటుకోళ్ల ఫాం ఏర్పాటుచేసి కోళ్లను పెంచుతున్నాడ. రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో దాణవేసి నీళ్లు పెట్టి వెళ్తుంటాడు. ఈక్రమంలో ఆదివారం కోళ్ల ఫాం వద్దకు వచ్చి చూడగా కోళ్లన్ని మృతి చెంది కనిపించాయి. సుమారు 500 కోళ్లు మృత్యువాత పడ్డాయని, వీటి విలువ సుమారు రూ.2లక్షల వరకు ఉంటుందని బాధితుడు రోదిస్తూ తెలిపారు. కోళ్లు తినే ఆహారంలో విషప్రయోగం జరిగి ఉంటుందని భావిస్తున్నాడు. ఈవిషయమై నర్సంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు సదానందం తెలిపారు.

పెరుగు ప్యాకెట్‌లో చనిపోయిన ఎలుక

ఖిలా వరంగల్‌: వరంగల్‌ ఎస్‌ఆర్‌ఆర్‌తోట సమీపంలోని ఓ కిరాణా షాపులో ఆదివారం కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్‌లో చనిపోయిన ఎలుక పిల్ల కనిపించింది. బాధితుడి కథనం ప్రకారం.. కిరాణా షాపులో పెరుగు ప్యాకెట్‌ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. ప్యాకెట్‌ను కట్‌ చేయగా అందులో చనిపోయిన ఎలుక పిల్ల కనిపించింది. వెంటనే అతడు కిరాణా యజమానిని నిలదీసి అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన అధికారులు పెరుగు ప్యాకెట్‌ విక్రయించిన షాపును పరిశీలించారు. వెంటనే ఆ బ్యాచ్‌కి సంబంధించిన ప్యాకెట్ల అమ్మకాలు నిలిపివేశారు. జనగామలో 50 ప్యాకెట్లు, కరీమాబాద్‌, లక్ష్మీపురం మార్కెట్‌ ఏరియా, హనుమకొండ భవానీనగర్‌లోని షాపుల్లో ఆ బ్యాచ్‌కి చెందిన పెరుగు ప్యాకెట్లను సీజ్‌ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు విక్రయించొద్దని షాపు నిర్వాహకులను ఆదేశించారు. వరంగల్‌ జిల్లా ఫుడ్‌ ఆఫీసర్‌ మౌనిక కరీమాబాద్‌లో తనిఖీలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నామని, ఆ బ్యాచ్‌కు సంబంధించిన పెరుగు అమ్మకాలు నిలిపివేసి శాంపిల్స్‌ను హైదరాబాద్‌ ల్యాబ్‌ పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణమూర్తి పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement