● ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం
మహబూబాబాద్/మహబూబాబాద్ అర్బన్ : త్యాగాలకు గుర్తింపు, గౌరవం లేదని తెలంగాణ ఉద్యమకారుల్లో ఆవేదన ఉందని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. మహబూబాబాద్‌లోని ఓ గార్డెన్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ జిల్లా సదస్సు ఆదివారం నిర్వహించారు. ముందుగా తెలంగాణ అమరుడు, జయశంకర్ చిత్రపటానికి కోదండరాం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా ఉద్యమకారులకు న్యాయం జరగలేదని, ఉద్యమకారుల అభిప్రాయాలను కమిటీకి తెలియజేస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులను కూడా ఉద్యమకారులుగానే గుర్తించాలన్నారు.
తెలంగాణ సంస్కృతిపై దాడులు..
తెలంగాణ సంస్కృతిపై ఇటీవల దాడులు జరుగుతున్నాయని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు రానివ్వడం లేదని కొంతమంది హైదరాబాద్‌లో మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వారు తీసిన సినిమాలు తెలంగాణ ప్రజలు చూస్తున్నారని, వారికి ఆదాయం తెలంగాణ ప్రజలు తీసుకున్న టికెట్ల రూపంలో రావడం లేదా అని వివరించారు. రావాల్సిన గోదావరి, కృష్ణా నదుల నీటి వాటా గురించి మాత్రం మాట్లాడరని తెలిపారు. ఎస్‌ఐఆర్ విషయమై మాట్లాడుతూ ఓటు నమోదు చేసుకోవాలని, లేకుంటే ఓటు హక్కు ముడిపెడితే అన్ని రకాలుగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ జిల్లా చైర్మన్ డాక్టర్ డోలి సత్యనారాయణ, నాయకులు పిల్లి సుధాకర్, మేక సురేష్‌రెడ్డి, పీరయ్య, శ్రీనివాస్, అంబటి శ్రీనివాస్, లింగన్న, చంద్రన్న, వెంకన్న శ్రీశైలం, శంతన్‌రామరాజు, కేకే, ఐల్లేష్, మల్లయ్య, హరి, సత్యనారాయణ, పాల్గొన్నారు.


