మహబూబాబాద్ రూరల్: పంట మార్పిడితో అధిక ఆదాయం వస్తుందని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమశాఖ అధికారి మరియన్న అన్నారు. మహబూబాద్ రైతు వేదికలో మంగళవారం ఉద్యాన వలంటీర్లకు శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మరియన్న మాట్లాడుతూ.. వరి, పత్తి, మొక్కజొన్న, మిరప పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్, పండ్లు, కూరగాయలు, మునగ, పూలు, మల్బరీ, తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం మొదలైన మార్కెట్ డిమాండ్ ఉన్న వాటిని సాగు చేసేందుకుగాను పలువురిని ఎంపిక చేసి ఇటీవల కొండా లక్ష్మ ణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇచ్చారని తెలిపారు. ఉద్యాన వలంటీర్లు కూరగాయలు, ఆయిల్ పామ్, మునగ, మల్బరీ తదితర మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల సాగులో తోటి రైతులకు స్వచ్ఛందంగా సహాయ, సహకారాలు అందిస్తారన్నారు. ప్రభుత్వ రాయితీలు, కూరగాయల పందిళ్లు, మల్చింగ్, కోల్డ్ రూమ్స్, నిల్వ గిడ్డంగులు, షేడ్ నెట్ హౌజ్‌లు, ఆయిల్ పామ్ రాయితీ, మార్కెటింగ్ వసతులు, మల్బరీ రాయితీలు అందిస్తామని తెలిపారు. రైతులు నీటి, భూసార పరీక్షలు చేయించుకోవాలని, ప్రకృతి సేద్యం అవలంభించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సరిత, వ్యవవసాయ సహాయ సంచాలకుడు అజ్మీరా శ్రీనివాసరావు, మార్కెటింగ్ క్షేత్ర స్థాయి అధికారి జయపాల్, కేవీకే ఉద్యాన శాస్త్రవేత్త బి.క్రాంతికుమార్, ఆయిల్ ఫెడ్ జిల్లా ఇన్‌చార్జ్ రాములు, మండల వ్యవసాయ అధికారి నారెడ్డి తిరుపతిరెడ్డి, ఉద్యాన అధికారులు ఆర్.శాంతిప్రియ, ఎ.జే.శాంతిప్రియదర్శిని, రైతులు పాల్గొన్నారు.


