డాక్యుమెంట్‌ రైటర్లపై ఏసీబీ నజర్‌! | - | Sakshi
Sakshi News home page

డాక్యుమెంట్‌ రైటర్లపై ఏసీబీ నజర్‌!

Apr 6 2026 9:30 AM | Updated on Apr 6 2026 9:30 AM

కాజీపేట అర్బన్‌: వరంగల్‌ ఆర్వో రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఈనెల 2, 3వ తేదీల్లో ఆకస్మికంగా మొదలైన తనిఖీలు 12 గంటల పాటు కొనసాగాయి. ఏసీబీ దాడుల్లో ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లు రామనరసింహారావు, ఆనంద్‌కు చెందిన ఖమ్మం, హనుమకొండలోని ఇళ్లలో ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో రూ.24,61,540 నగదు, 819.500 గ్రాముల బంగారం, 2.600 కిలోగ్రాముల వెండి, 30 లక్షల ఎఫ్‌డీ బాండ్లతోపాటు డాక్యుమెంట్‌ రైటర్ల నుంచి వసూళ్ల కోసం ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్‌ వ్యక్తి ద్వారా రూ.42 లక్షల లావాదేవిల వివరాలను సేకరించారు. కాగా ఈ దాడుల్లో కార్యాలయం ఆవరణలోని 20 మంది డాక్యుమెంట్‌ రైటర్ల వద్ద నుంచి 70 దస్తావేజులు రూ.47,450 స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజు కొందరు డాక్యుమెంట్‌ రైటర్లు కార్యాలయాలను తెరవలేదు. దీంతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో అవినీతికి మూలమైన డాక్యుమెంట్‌ రైటర్లపై ఏసీబీ నిఘా పెంచినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. లైసెన్స్‌ లేకున్నా వరంగల్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో సుమారు 200 మంది డాక్యుమెంట్‌ రైటర్లుగా చలామణి అవుతూ నెలకు రూ.లక్షలు సంపాదిస్తున్నారు. వీరు ఆన్‌లైన్‌లో లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఏసీబీ దాడులు..

గతఏడాది ఏసీబీ అధికారులు వరంగల్‌ ఆర్వో కార్యాలయంలోని జిల్లా రిజిస్ట్రార్‌ చాంబర్‌కు ఆనుకుని ఉన్న ఓ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిపై దాడి చేసేందుకు వచ్చినట్లే వచ్చి వెళ్లిపోయారు. కాగా సదరు ఉద్యోగి ఏసీబీ దాడుల నుంచి వెంట్రుక వాసలో తప్పించుకుని అదే కార్యాలయంలో మరో విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా ఈ ఏడాది ఏసీబీ అధికారులు పక్కా ఫిర్యాదులు, సమాచారంతో దాడులు నిర్వహించి భారీ మొత్తంలో స్వాధీనపరచుకున్నారు. ఇదిలా ఉండగా.. చిట్స్‌ కార్యాలయంలో నిలిచిపోయిన ఎఫ్‌డీ రిలీజ్‌పై ఏసీబీ ఆరా తీస్తున్నట్లు సమాచారం

డాక్యుమెంట్‌ రైటర్ల ఆగడాలు ఇలా..

వరంగల్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో గతేడాది ఓ డాక్యుమెంట్‌ రైటర్‌ ఏకంగా కార్యాలయ సిబ్బంది అవతారమెత్తి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో భాగమైన ఫొటోలను తీసే సెక్షన్‌లో దర్జాగా తిష్ట వేసి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేశాడు.

ఓ సామాజిక వర్గానికి చెందిన ఓ సంస్థ స్థలాన్ని ఓ సీనియర్‌ డాక్యుమెంట్‌ రైటర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించడంతో గొడవ పీఎస్‌ వరకు వెళ్లింది.

కాజీపేటలోని ఓ స్థలం విషయంలో ఇద్దరి మధ్య గొడవ ఉండడంతో కోర్టులో కేసు నమోదైంది. కానీ, ఓ డాక్యుమెంట్‌ రైటర్‌ మధ్యవర్తిత్వంతో ఏకంగా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయించా డు. దీంట్లో రూ.లక్షల్లో లావాదేవిలు జరిగిన ట్లు సమాచారం. కార్యాలయంలో సబ్‌రిజి స్ట్రార్‌ నిలదీయడంతో గొడవ చోటు చేసుకుంది.

నగర చుట్టు పక్కన గల గ్రామాల్లో రియల్టర్స్‌ రూపొందించిన నాన్‌ లే అవుట్‌ ప్లాట్లకు నంబర్లు లేకున్నా.. ఓ డాక్యుమెంట్‌ రైటర్‌ రిజిస్ట్రేషన్లు సుమారు పదికి రిజిస్ట్రేషన్లు చేయించాడు. ఇక్కడితో ఆగకుండా నాన్‌ లే అవుట్‌ ఉంటే తీసుకురండి.. అంటూ ఇతర డాక్యుమెంట్‌ రైటర్లకు ఆఫర్‌ ఇస్తున్నాడు.

ఖాళీ స్థలానికి ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోయినా పర్వాలేదు.. పక్క ఇంటి నంబర్‌ వేసి హౌజ్‌ అసెస్‌మెంట్‌లా క్రియేట్‌ చేసి ఓ డాక్యుమెంట్‌ రైటర్‌ తన ప్రత్యేకతను చాటుకుంటూ సబ్‌ రిజిస్ట్రార్‌కు ఆదాయవనరుగా మారడం గమనార్హం.

వరంగల్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఇటీవల తనిఖీలు

లైసెన్స్‌ లేకున్నా రూ.లక్షల్లో రైటర్ల

అక్రమార్జన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement