కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య సీడీఓఈ బీఎల్‌ఐఎస్సీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, ఎక్స్ విద్యార్థులకు ఈనెల 24నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 24, 27, 29 తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
దంపతులకు గాయాలు
కురవి: శుభాకార్యానికి వెళ్తున్న దంపతుల బైక్‌ను కారు ఢీకొనడంతో భార్యభర్తలకు ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన ఆదివారం రాత్రి కురవి శివారులోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల వద్ద ఖమ్మం జాతీయ రహదారిపై జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కురవి మండలం బలపాల శివారు లింగ్యాతండాకు చెందిన బానోత్ హరిచంద్–జ్యోతి దంపతులు బైక్‌పై తండా నుంచి మహబూబాబాద్ వయా వావిలాల గ్రామానికి వెళ్తున్నారు. ఈక్రమంలో కురవి శివారు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల సమీపంలోకి రాగానే కురవి నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో బైక్‌పైనుంచి ఇద్దరు కిందపడిపోయారు. హరిచంద్‌కు తీవ్రగాయాలు కాగా, భార్య జ్యోతికి స్వల్పగాయాలయ్యాయి. సంఘటన స్థలం వద్ద ఉన్న వ్యక్తులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో హుటాహుటీన అంబులెన్స్ చేరుకుంది. తీవ్రగాయాలైన భార్యాభర్తలు ఇద్దరిని ఈఎంటీ గాంధీ, పైలట్ రఫీలు అంబులెన్స్‌లో ఎక్కించి ప్రాథమిక చికిత్స అందించారు. మహబూబాబాద్‌లోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఇదిలాఉండగా.. బైక్‌ను ఢీకొట్టిన కారు ఆపకుండా వెళ్లిపోయింది.
చికిత్స పొందుతున్న మహిళ మృతి
బచ్చన్నపేట : దంపతుల మధ్య గొడవతో క్షణికావేశంలో మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందింది.ఈ సంఘటన మండలంలోని బసిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. తరిగొప్పుల మండలంలోని కనీలకుంట గ్రామానికి చెందిన దండు ఉప్పలమ్మ, కృష్ణమూర్తి దంపతుల మూడో కుమార్తె ప్రేమలతను (29) తొమ్మిదేళ్ల క్రితం బచ్చన్నపేట మండలం బసిరెడ్డిపల్లికి చెందిన పుప్పాల కర్ణాకర్‌తో వివాహం జరిపించారు. వీరికి కుమారుడు వర్షిత్, కూతురు నివీక్ష ఉన్నారు. ఐదు రోజుల క్రితం భార్యభర్తలు గొడవ పడగా క్షణికావేశంలో భార్య ప్రేమలత ఇంట్లోని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన భర్త కర్ణాకర్ బచ్చన్నపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అనంతరం మెరుగైన వైద్యంకోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ప్రేమలత మృతిచెందింది. మృతురాలు తల్లి ఉప్పలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


