హన్మకొండ: కల్లుతాగిన కోతిలా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి ఉందని, రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి చూపిస్తే హనుమకొండ చౌరస్తాలో ఉరేసుకుంటానని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో ముఖ్యనేతగా ఉన్న విజయన్‌పై మాట్లాడేస్థాయి రేవంత్‌కి లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత రాష్ట్రంలో పంటల దిగుబడి ఎలా ఉందో అందరికీ తెలుసని, రూ.లక్ష కోట్లు నీళ్లపాలయ్యాయని కాళేశ్వరంపై కేంద్ర మంత్రి విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. 2014కు ముందు తెలంగాణ వరి ఉత్పత్తిలో ఎక్కడో ఉండేదని, కాళేశ్వరం ప్రాజెక్టుతో 2023 నాటికి దేశంలోనే నంబర్ వన్ స్థాయికి ఎదిగిందన్నారు. గజ్వేల్‌లోని కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ ఆఫీస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో పెట్టుకుంటారా.. అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి ఏ పార్టీకి చెందినవారో స్టేషన్ ఘన్‌పూర్ ప్రజలతో రెఫరెండం నిర్వహించాలన్నారు. మేడారంలో రూ.కోట్లు ఖర్చు పెట్టి చేసిన పనులు నాసిరకంగా ఉన్నాయని, రెండు టన్నుల రాయి పడడంతో గాయపడి వరంగల్ గార్డియన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి యువన్‌ను పరామర్శించినట్లు చెప్పారు. సీఎంతో సహా మంత్రులు క్యాంపు పెట్టింది వాటాల కోసమేనని అరోపించారు. బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని, ఈ సంఘటనను ఖండిస్తున్నట్లు చెప్పారు. జెడ్పీ మాజీ చైర్మర్ సాంబారి సమ్మారావు, నాయకులు బొంగు అశోక్, పులి రజనీకాంత్, తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, రామ్మూర్తి, జోరిక రమేష్, నయీముద్దీన్ పాల్గొన్నారు.
ఆరు గ్యారంటీలు అమలు
చూపిస్తే ఉరేసుకుంటా
మేడారంలో నాసి రకం పనులు.. వాటాల కోసం మకాం
శాసన మండలి ప్రతిపక్ష నేత
మధుసూదనాచారి


