మహబూబాబాద్ రూరల్ : వైద్య పరీక్షల కోసం వస్తూ రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతిచెందిన ఘటన మహబూబాబాద్ మండలంలోని మల్యాల గ్రామ శివారులో ఆది వారం చోటుచేసుకుంది. కురవి ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. మానుకోట జిల్లా చిన్నగూడూరు మండలం మేగ్యతండాకు చెందిన భూక్యా నరేందర్, శిరీష (27) దంపతులు వైద్య పరీక్షల కోసం తమ నాలుగేళ్ల కుమారుడిని తీసుకుని ద్విచక్ర వాహనంపై మహబూబాబాద్ బయల్దేరారు. కురవి మండలంలోని రాయినిపట్నం మీదుగా మహబూబాబాద్ మండలం మల్యాల నుంచి వస్తున్నారు. ఈ క్రమంలో మల్యాల గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ఓ కారు ఆగి ఉంది. వాహనానికి సంబంధించిన వ్యక్తి వెనుకకు చూసుకోకుండా కారు డోర్ తీయడంతో అటువైపుగా వస్తున్న నరేందర్, శిరీష వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో శిరీషకు తీవ్రగా యాలుకాగా సదరు కారు నిర్వాహకులు ఆమెను అదే కారులో మహబూబాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందింది. శిరీష భర్త నరేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపిక
నెల్లికుదురు: ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో ఈ నెల 4 నుంచి 8 వరకు జరుగుతున్న రగ్బీ పోటీలకు 69వ ఎస్‌జీఎఫ్ అండర్ 17 బాలుర విభాగంలో మండలంలోని ఆలేరు ఉన్నత పాఠశాల విద్యార్థి బానోతు యశ్వంత్ పాల్గొంటున్నట్లు ఎంఈఓ రాందాస్ తెలిపారు. గత డిసెంబర్‌లో డోర్నకల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలో యశ్వంత్ ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని వెల్లడించారు.
● రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి


