● అసెంబ్లీలో ఎమ్మెల్యే మురళీనాయక్
మహబూబాబాద్ రూరల్ : గడ్డిమందు పారాక్వాట్ డైక్లోరైడ్‌ను పూర్తిగా నిషేధించాలని అసెంబ్లీలో ఆమోదించి ప్రభుత్వానికి పంపించడం అభినందనీయమని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ గడ్డి మందును నిషేధించాలనే అంశంపై సోమవారం మాట్లాడారు. పారాక్వాట్ గడ్డి మందును నిషేధించాలని గతంలో అసెంబ్లీలో రెండు, మూడుసార్లు విజ్ఞప్తి చేశానని గుర్తుచేశారు. ఈ గడ్డిమందుకు విరుగుడు మందులేదని, కుటుంబ తగాదాలు, చిన్నచిన్న విషయాలకు మనస్థాపానికి గురై గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. గడ్డిమందును తాగిన గంటన్నరలోనే కాలేయం, ఊపిరితిత్తులు, గుండె, తదితర అవయవాలు పనిచేయకుండా పోతున్నాయని, బాధితులకు వెంటనే డయాలసిస్ చేసి సరైన చికిత్స చేసినా బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. గడ్డిమందుపై నిషేధం విధించే వరకు అందరం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, వ్యవసాయ అధికారుల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే విక్రయించాలని కోరారు. మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మరో ఐదు డయాలసిస్ బెడ్లను పెంచారని, అందులో ఒక బెడ్ గడ్డిమందు తాగి ఆత్మహత్యలకు పాల్పడిన వారికి రిజర్వ్ చేశారని, ఐదు డయాలసిస్ బెడ్లను పెంచినందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


