విశ్వాసంతో క్రీస్తును ఆరాధించాలి
మహబూబాబాద్ రూరల్ : విశ్వాసంతో ఏసుక్రీస్తును ఆరాధించడం ద్వారా మహిమను పొందగలుగుతామని విశాఖపట్నం అగ్ర పీఠాధిపతి బిషప్ ఉడుముల బాల అన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనగపురం గ్రామ శివారులో కరుణామయి మేరీ మాత పుణ్యక్షేత్రం ఏసుగుట్ట వద్ద బంజారా క్రిస్మస్ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మొదటగా జిల్లా కేంద్రంలోని ఫాతిమా మాత దేవాలయం నుంచి మరియమాత విగ్రహాన్ని పల్లకిలో ఊరేగింపుగా భక్తిశ్రద్ధలతో పాటలు పాడుతూ ఏసుగుట్ట వరకు తీసుకుని వెళ్లారు. అనంతరం అక్కడి కరుణామయి మరియమాత సన్నిధిలో నూతనంగా నిర్మించిన షెడ్డును బిషప్ ఉడుముల బాల ప్రారంభించి మాట్లాడారు. ఏసుక్రీస్తు విశ్వమంతటికీ తన అనుగ్రహాన్ని ప్రసాదించడం కోసం ఈ భూమిపైకి వచ్చారన్నారు. అదేవిధంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులను సత్కరించి వారికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి ఆశీర్వాదాలు అందజేశారు. వరంగల్ మేత్రాసనం పాలన అధికారి విజయపాల్ రెడ్డి, ఫాతిమా మాత దేవాలయ విచారణ గురువు సైమన్, గునేలియన్ సంస్థ అధ్యక్షుడు అసీసీ, ఫాదర్లు శ్రావణ్ రెడ్డి, పీటర్, క్రీస్తు, జోసెఫ్, థామస్, క్రీస్తు ఆరాధకులు పాల్గొన్నారు.


