తండ్రి మందలించాడని కుమారుడి ఆత్మహత్య
టేకుమట్ల: తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని బూర్నపల్లిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్నపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కొండ సర్వేశం కుమారుడు తరుణ్(20) ఈ నెల 17న పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రానికి ట్రాక్టర్ మరమ్మతుల కోసం తీసుకెళ్తున్నాడు. ఈక్రమంలో ట్రాక్టర్ పొలాల్లోకి దూసుకెళ్లి దిగబడగా తండ్రి అలా ఎందుకు చేశావని తరుణ్‌ను మందలించాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం పరకాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కాగా మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై దాసరి సుధాకర్ తెలిపారు.


