జీపీ భవనానికి రంగులేసిన సర్పంచ్
మహబూబాబాద్ రూరల్ : గ్రామపంచాయతీ నూతన పాలకవర్గాలు సోమవారం ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్న విషయం తెలిసిందే. కాగా మహబూబాబాద్ మండలంలోని మాధవపురం గ్రామపంచాయతీ కార్యాలయ భవనానికి సంబంధిత అధికారులు నూతనంగా రంగులు వేయించలేదు. దీంతో ఇటీవల కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్‌గా గెలుపొందిన వెంపటి రమేష్ స్వయంగా జీపీ భవనానికి రంగులు వేశారు. తన వృత్తి పెయింటర్ కాగా సర్పంచ్‌గా ప్రజలకు సేవ చేయాలని ఎన్నికై న నేపథ్యంలో ఆయన ఇంకొకరిపై ఆధారపడకుండా జీపీ కార్యాలయ భవనానికి రంగులు వేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ముగిసిన జిల్లాస్థాయి
టెమ్రిస్ క్రీడోత్సవాలు
న్యూశాయంపేట: తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యాసంస్థలు(టెమ్రిస్) ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని వరంగల్(బీ 1), వరంగల్(జీ 2) గురుకులాల్లో మూడురోజులుగా నిర్వహిస్తున్న బాల, బాలికల మూడో ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. వివిధ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు డీఎండబ్ల్యూఓ టి.రమేష్, ఆర్‌ఎల్‌సీ జంగా సతీష్ బహుమతులు, సర్టిఫికెట్స్ అందచేశారు. ముగింపు కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లాలోని వివిధ గురుకులాల ప్రిన్సిపాళ్లు, విజిలెన్స్ ఆఫీసర్లు, పీడీ, పీఈటీలు, వార్డెన్స్, కళాశాలల అధ్యాపకులు, పాఠశాలల ఉపాధ్యాయులు, నాన్‌టీచింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.
200 కిలోల బెల్లం స్వాధీనం
కేసముద్రం: కేసముద్రం రైల్వేస్టేషన్‌లో నిలిచిన కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైల్లో అక్రమంగా తరలించిన నల్లబెల్లం, పట్టికను కొందరు వ్యక్తులు తరలిస్తుండగా వరంగల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ రజితరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పట్టుకున్నారు. ఈ మేరకు అక్రమంగా బెల్లం తరలిస్తున్న మున్సిపాలిటీ పరిధి తండాకు చెందిన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, 200 కిలోల నల్లబెల్లం, 30 కిలోల పట్టికను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది వెంకటస్వామి, రాజు, వరుణ్‌రెడ్డి, ఆర్‌పీఎఫ్ ఎస్సై సుభాని, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరావు, ఖన్న, సెకండ్ ఎస్సై నరేష్ పాల్గొన్నారు.
తారు వేస్తున్నారా... పూస్తున్నారా?
ఏటూరునాగారం: మేడారం జాతర సందర్భంగా ఆర్‌అండ్‌బీ శాఖ మండలంలోని చిన్నబోయినపల్లి నుంచి దొడ్ల వరకు 6.6 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్డు మరమ్మతుల కోసం రూ. 22లక్షలు మంజూరు చేసింది. ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ బీటీ రోడ్డుపై తారు వేస్తున్నారా... లేక పూస్తున్నారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతంలో ఉన్న బీటీ రోడ్డుపై అనేక గుంతలు పడ్డాయి. కొన్ని చోట్ల బీటీ లేచిపోయి కంకర తేలింది. దీంతో ప్రయాణికులు, భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడేవారు. కానీ, కాంట్రాక్టర్ అతంతమాత్రంగానే మరమ్మతులు చేయడంతో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు. వెంటనే మరమ్మతులు నాణ్యతగా చేయించాలని స్థానికులు ఆర్‌అండ్‌బీ అధికారులను కోరుతున్నారు.
జీపీ భవనానికి రంగులేసిన సర్పంచ్
జీపీ భవనానికి రంగులేసిన సర్పంచ్


