ప్లాట్ల కోసం పైసలు తీసుకుని..
జనగామ: జనగామ జిల్లా రఘునాథపల్లి నిడిగొండ శివారులో స్నేహమిత్ర బిల్డర్స్ పేరిట ప్లాట్ల అమ్మకాలు చేసి, డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయకుండా నిర్వాహకులు పత్తా లేకుండా పోయారని జగన్నాథ టౌన్‌షిప్ ప్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ప్రధాన సలహాదారు గంగుల మల్లయ్య యాదవ్, అధ్యక్షుడు రంగారావు, ఉపాధ్యక్షుడు నడిగడ్డ యాకయ్య, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం వెంచర్ సమీపంలో రాష్ట్రంలోని హైదరాబాద్, ఉప్పల్, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల నుంచి వచ్చిన బాధిత ప్లాట్ల ఓనర్లతో కలిసి ఏర్పాటు చేసిన అసోసియేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014లో పూర్ణచందర్ శెట్టితో పాటు ఆయన తల్లి అయోధ్యమ్మ, చెల్లెలు నాగమణి ముగ్గురు కలిసి స్నేహమిత్ర బిల్డర్ పేరిట జగన్నాథ టౌన్‌షిప్, ఏబీ పార్టులుగా 80 ఎకరాల్లో వెంచర్ ప్రారంభించారని తెలిపారు. ఇందులో 120 గజాల చొప్పున 2500కు పైగా ప్లాట్లుచేసి, రాష్ట్రంలోని అనేక జిల్లాలో ఏజెంట్లను పెట్టుకుని ప్లాట్లను అమ్ముకున్నారన్నారు. ఇందులో పేద, దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే ఎక్కువగా ప్లాట్లు కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. ఇందులో కొంతమేర రిజిస్ట్రేషన్ చేయగా, మరికొన్ని ప్లాట్లకు సంబంధించి నిర్వాహకులు రిజిస్ట్రేషన్ ఫీజుతో సహా డబ్బులు ముందుగానే తీసుకుని, నేటి వరకు రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. భూమికి సంబంధించి కొంత భాగం కోర్టులో ఉందంటూ వేలాది మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పూర్ణచందర్ శెట్టి అమెరికాలో ఉన్నప్పటికీ, నాగమణి, అయోధ్యమ్మకు రిజిస్ట్రేషన్ చేసే అధికారం ఉన్నా కాలయాపన చేస్తున్నారన్నారని వాపోయారు. ఫోన్‌ద్వారా ఒత్తిడి చేసిన సమయంలో గ్రీన్‌కార్డు ఉందని, తనను ఏమీ చేయలేరని పూర్ణచందర్ శెట్టి దబాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్నేహమిత్ర బిల్డర్స్ ఆధ్వర్యంలో చేసిన వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన వేలాది మంది కుటుంబాలు నష్టపోకుండా ప్రభుత్వం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్లాట్ల రిజిష్ట్రేషన్‌తో పాటు పూర్తిస్థాయిలో తమకు అప్పగించే వరకు తమ న్యాయ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు.
మాట్లాడుతున్న జగన్నాథ టౌన్‌షిప్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు
రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి వచ్చిన బాధితులు
రెక్కల కష్టం దోచుకున్న
స్నేహమిత్ర బిల్డర్స్
రిజిస్ట్రేషన్ చేయమంటే తప్పించుకు తిరుగుతున్నారు
ఫోన్ చేసినా స్పందించడం లేదు.. న్యాయం జరిగే వరకు ఉద్యమం
జగన్నాథ టౌన్‌షిప్ ప్లాట్స్ ఓనర్స్
వెల్ఫేర్ అసోసియేషన్ హెచ్చరిక
ప్లాట్ల కోసం పైసలు తీసుకుని..


