కేయూ బీటెక్ సెమిస్టర్ల పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బీటెక్ మూడు, ఐదు, ఏడో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 22 నుంచి నిర్వహించాల్సిండగా ఆయా పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షలను ఈనెల 29 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే పూర్తి టైం టేబుల్‌ను త్వరలోనే తెలియజేస్తామని ఆయన తెలిపారు.
కారు బోల్తా: ఇద్దరికి
తీవ్రగాయాలు
కాటారం: అదుపుతప్పి కారు బోల్తా పడడంతో ఇద్దరు తీవ్రగాయాలపాలైన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లి అటవీ ప్రాంతంలో జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదుగురు ప్రయాణికులతో మంథని నుంచి మేడారం వైపు వెళ్తున్న కారు కమలాపూర్ క్రాస్ సమీపంలో మేడిపల్లి అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కకు అతివేగంగా దూసుకెళ్లింది. ప్రమాదవశాత్తు కారు బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న సౌజన్య, సునీత కారులో ఇరుక్కుని తీవ్రగాయాలపాలయ్యారు. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించడంతోపాటు కారులో ఇరుకున్న వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై–2 రాజశేఖర్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.
బోల్తా పడిన కారు..
కాటారం మండలం గుమ్మాళ్లపల్లి వద్ద వరి ధాన్యం కుప్పను ఢీ కొట్టి ఓ కారు బోల్తా పడింది. ఒడిపిలవంచ నుంచి కాటారం వైపు వెళ్తున్న కారు డ్రైవర్ రహదారిపై ఆరబోసిన ధాన్యం కుప్పను గమనించకుండా ఎక్కించడంతో బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.


