పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు
నెహ్రూసెంటర్: జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు ఈనెల 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ బి.రవిరాథోడ్ శనివారం తెలిపా రు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఆప్తాలమిక్ అధికారులు, రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమం డాక్టర్లు, సిబ్బందికి శనివారం నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లోని పిల్లల్లో కనిపించే దృష్టిలోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా చదువులో ప్రతిభను మెరుగుపర్చడం కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఉచిత కంటి పరీక్షలు, రిప్రాక్టివ్ ఎర్రర్ గుర్తింపు, ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఓ సుమన్ కల్యాణ్, ఆర్‌బీఎస్‌కే వైద్యాధికారులు, డెమో ప్రసాద్, కేవీరాజు, తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: సీఎం విదేశి విద్యా పథకానికి ఉపకార వేతనాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి బి.శ్రీనివాస్‌రావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 2025 నుంచి 31 కాలంలో ఫాల్ సిజన్ అడ్మిషన్ పొందిన అర్హతగల విద్యార్థులు నేటి నుంచి జనవరి 19వ తేదీ వరకు www.telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు 91779 96098, 91825 40680 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలని కోరారు.
క్లెయిమ్ చేయని ఆస్తులపై అవగాహన
మహబూబాబాద్: క్లెయిమ్ చేయని ఆస్తులపై మీ సొమ్ము.. మీ హక్కు అనే నినాదంతో జాతీయ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో ఆయన మాట్లాడారు. కై ్లమ్ చేయని బ్యాంక్ డిపాజిట్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ సొమ్మును సులభంగా పొందేలా ఈ నినాదంతో అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎల్‌బీసీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీహరి, ఏఎన్‌వీ సుబ్బారావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
పేషంట్లకు నాణ్యమైన భోజనం అందించాలి
గూడూరు: ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నవారికి నాణ్యమైన భోజనం అందించాలని ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వరంగల్ యూనిట్ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను శనివారం అడిషనల్ ఎస్పీ సూచనల మేరకు సీఐ కిషోర్, వెంకటభాస్కర్, తహసీల్దార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రోగులకు అందుతున్న భోజనం, మెనూ, సరఫరా వివరాల రికార్డులు పరిశీలించారు. పేషంట్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
యూనివర్సిటీలో విద్యార్థుల సమ్మేళనం
కేయూ క్యాంపస్: తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థుల సమ్మేళనాన్ని కేయూలో ఈనెల 22, 23 తేదీల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఆ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు తెలిపారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని ఆడిటోరియం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగ సమస్యలపై చర్చించేందుకు అన్ని యూనివర్సిటీల నుంచి సుమారు 1,000 మంది విద్యార్థులు ఈసమ్మేళనంలో పాల్గొననున్నారని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏబీవీపీ కేయూ అధ్యక్షుడు ఉబ్బటి హరికృష్ణ, కార్యదర్శి జ్ఞానేశ్వర్, పూర్వ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్, వరంగల్ మహానగర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆగపాటి రాజ్‌కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు సరయి, కార్యదర్శి వీక్షిత, బాధ్యులు ధనలక్ష్మి, సాయి, అఖిల్, వినయ్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు


