అధ్వానంగా ‘కాళేశ్వరం’ గ్రావిటీ కెనాల్
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రధానమైన లక్ష్మీపంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీ వరకు నీటిని తరలించే గ్రావిటీ కెనాల్ అధ్వానంగా మారింది. 2023 అక్టోబర్ 21న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీలో 20వ పియర్ కుంగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారం రోజులకు అన్నారం (సరస్వతి) బ్యారేజీలో సీపేజీ లీకేజీలు ఏర్పడ్డాయి. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమగ్ర విచారణలో భాగంగా ఏన్‌డీఎస్‌ఏ సూచనల మేరకు తాత్కాలికంగా ఎత్తిపోతలు, బ్యారేజీల్లో నీటి స్టోరేజీ నిలిపివేసింది. అప్పటి నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటినిల్వలు చేయడం లేదు. దీంతో కన్నెపల్లి సమీపంలో నిర్మించిన లక్ష్మీపంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీ వరకు 13.50 కిలోమీటర్ల మేర ఉన్న గ్రావిటీ కెనాల్‌లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరి గాయి. రెండుమూడు మీటర్ల లోతుకు మట్టి, గడ్డితో కూరుకుపోతోంది. అక్కడక్కడా డ్యామేజీ, పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రాజెక్టులో తాత్కాలికంగా ఎత్తిపోతలు నిలిపివేయడంతో మరమ్మతులు చేపట్టడంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇలానే కాలం గడుస్తుంటే శిథిలావస్థకు చేరే అవకాశం ఉంది.
పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో
నిండిన కాల్వ
పట్టించుకోని నీటిపారుదల శాఖ అధికారులు


