జూడోతో ఆత్మవిశ్వాసం
వరంగల్ స్పోర్ట్స్: జూడో క్రీడతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని, బాలికలు జూడోలో రాణించి ఒలింపిక్స్ వరకు వెళ్లాలని హనుమకొండ డీఈఓ ఎల్.వి.గిరిరాజ్ గౌడ్ అన్నారు. హనుమకొండలోని డీఎస్‌ఏ బాక్సింగ్ హాల్‌లో శనివారం పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–14 తెలంగాణ రాష్ట్రస్థాయి బాలికల జూడో పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. జాతీయ స్థాయిలో రాణించి జిల్లా, రాష్ట్రానికి ఖ్యాతి తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ వరకు జరగనున్న పోటీలకు రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి 140 మంది క్రీడాకారులు, రెఫరీలు హాజరైనట్లు తెలిపారు. ఇందులో విజేతలైన క్రీడాకారులు జనవరి 6 నుంచి 11వ తేదీ వరకు పంజాబ్‌లోని లుథియానాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ బి. రాందాన్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సదానందం, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ సుధాకర్, వాలీబాల్ సంఘం బాధ్యుడు రాముడు, జూడో కన్వీనర్ ఎం సురేశ్ బాబు, కో కన్వీనర్ నిశాంత్, తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ డీఈఓ గిరిరాజ్ గౌడ్
అట్టహాసంగా రాష్ట్రస్థాయి
జూడో పోటీలు ప్రారంభం


