పత్తి విక్రయించి వస్తూ మృత్యుఒడికి..
మహబూబాబాద్ రూరల్ : ఓ రైతు పత్తి పంట విక్రయించి వస్తూ మృత్యుఒడికి చేశాడు. టిప్పర్.. బొలెరోను ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి జమాండ్లపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. మహబూబాబాద్ రూరల్ రెండో ఎస్సై రవికిరణ్ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలం గిద్దవారిగూడెం గ్రామానికి చెందిన కడారి ఉపేందర్ (55) పత్తి అమ్మడానికి ఈ నెల 18వ తేదీ( గురువారం) వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు వెళ్లాడు. పత్తి విక్రయించిన అనంతరం తిరుగు ప్రయాణంలో వరంగల్ నుంచి నర్సంపేట మీదుగా బొలెరోలో ఇంటికి వస్తున్నాడు. ఈ క్ర మంలో మహబూబాబాద్ మున్సిపాలి టీ పరిధి జమాండ్లపల్లి శివారులో టిప్పర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వెనుకకు వచ్చింది. అంతలోనే బొలెరో నడుపుతున్న డ్రైవర్ నరేశ్ తన వాహనాన్ని అదుపు చేసేలోగా టిప్పర్ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరో బోల్తా పడి పక్కకు పడిపోగా ఉపేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ నరేశ్‌కు తీవ్ర గాయాలుకావడంతో అతడిని ఖమ్మంలో ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి భార్య మాణిక్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
బొలెరోను ఢీకొన్న టిప్పర్..
అక్కడికక్కడే రైతు మృతి
జమాండ్లపల్లి శివారులో ఘటన


