ఎక్కడి బస్సులు అక్కడే.. | - | Sakshi
Sakshi News home page

ఎక్కడి బస్సులు అక్కడే..

Oct 31 2025 8:02 AM | Updated on Oct 31 2025 8:06 AM

నెహ్రూసెంటర్‌: భారీ వర్షంతో జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగడంతో ఆర్టీసీ బస్సులు గురువారం ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మహబూబాబాద్‌ డిపో నుంచి ప్రధానంగా ఖమ్మం, ఇల్లెందు, సూర్యాపేట, నర్సంపేట, హనుమకొండ, భద్రాచలం, హైదరాబాద్‌, తొర్రూరు ప్రాంతాలకు ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు అందుతున్నాయి. అయితే ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో వాగులు ఉప్పొంగడంతో నర్సంపేట–వరంగల్‌, కేసముద్రం–వరంగల్‌, కురవి–ఖమ్మం, మహబూబాబాద్‌–తొర్రూరు రూట్లలో పూర్తిగా బస్సులను నిలిపివేశారు. మానుకోట– సూర్యాపేట, మానుకోట–ఇల్లెందు, మానుకోట–భద్రాచలం రూట్లలో బస్సులను నడిపిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. తుపాను వల్ల వాగులు, వంకలు పొంగడం, బస్సులు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నేడు 2కే రన్‌

మహబూబాబాద్‌ రూరల్‌ : సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 150వ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 6:45 గంటలకు 2కే రన్‌ నిర్వహించనున్నట్లు ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహబూబాబాద్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌ నుంచి నెహ్రూ సెంటర్‌, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, అండర్‌ బ్రిడ్జి, ఎఫ్‌ఆర్‌ఓ సెంటర్‌, వివేకానంద సెంటర్‌ మీదుగా ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద 2కే రన్‌ ముగుస్తుందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాల యువతి, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రన్‌ ఫర్‌ యూనిటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్పీ కోరారు. దేశ ఐక్యత, సమగ్రతకు గుర్తుగా జరుపుకునే ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికా రులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొని దేశ ఏకతా స్ఫూర్తిని మరింత బలపరచాలని కోరారు.

విద్యుత్‌ను వెంటనే పునరుద్ధరించాలి

గూడూరు: ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడే విద్యుత్‌ అంతరాయాలను గుర్తించి వెంటనే పునరుద్ధరించాలని టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. మోంథా తుపాను ప్రభావంతో విద్యుత్‌ అంతరాయం ఏర్పడగా.. గురువారం విద్యుత్‌ పునరుద్ధరణ పనులను సీఎండీ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి మండలంలోని అన్ని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా చేసిన ఉద్యోగులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ పి. విజయేదర్‌రెడ్డి, డివిజన్‌ ఇంజనీర్‌ హీరాలాల్‌, ఏడీఈ కె.కవిత, సబ్‌ ఇంజనీర్‌ లక్ష్మణ్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పదో తరగతి పరీక్ష ఫీజును రద్దు చేయాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు రూ.125ను ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పూర్తిగా రద్దు చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చాగంటి ప్రభాకర్‌, ట్రైబల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బి.వీరునాయక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, ట్రైబల్‌ ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈఓ దక్షిణామూర్తికి పదో తరగతి పరీక్షల ఫీజును రద్దు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌, వీరునాయక్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులే చదువుతున్నారని, రూ.125 చెల్లించకపోతే కుల, నివాసం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకొని రావాలని అధికారులు చెబుతున్నారని, వాటికి రూ. 500 నుంచి రూ.1000 ఖర్చు అవుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పూర్తిస్థాయిలో ఫీజును రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శివనాయక్‌, జిల్లా అధ్యక్షులు భధ్రునాయక్‌, మద్దెల వీరస్వామి, జిల్లా నాయకులు శ్రీనివాస్‌, పర్వతాలు, యాకోబు నాయక్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎక్కడి బస్సులు అక్కడే..
1
1/2

ఎక్కడి బస్సులు అక్కడే..

ఎక్కడి బస్సులు అక్కడే..
2
2/2

ఎక్కడి బస్సులు అక్కడే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement