 
															ముందస్తుగా అప్రమత్తం చేయాలి
● ధాన్యం సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి
● వీసీలో సీఎం రేవంత్‌రెడ్డి
మహబూబాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు, వాగులు, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు, లోలెవల్ కల్వర్టుల దగ్గర పరిస్థితులను గుర్తించి స్థానికులను ముందస్తుగానే అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ నుంచి గురువారం సీఎం రేవంత్‌రెడ్డి ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి తుపాను ప్రభావంపై జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రానికి మండలస్థాయి అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించాలని సూచించారు. వీసీలో కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
