 
															స్తంభించిన జనజీవనం
● జలదిగ్బంధంలో మానుకోట
● రాకపోకలకు అంతరాయం
మహబూబాబాద్,/మహబూబాబాద్ అర్బన్: భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. మోంథా తుపానుతో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో మానుకోట నుంచి పలు నగరాలు, పట్టణాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా మానుకోట నుంచి నర్సంపేట, వరంగల్, కేసముద్రం, ఖమ్మం, తొర్రూరుకు రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు, వాహనదారులు, ఉద్యోగస్తులు పలు గ్రామాలకు వెళ్లలేకపోయారు. కాగా, మానుకోటలోని పలు కాలనీలు జలదిగ్బంధం కావడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.
నిలిచిన రాకపోకలు..
భారీ వర్షంతో మానుకోట నుంచి నర్సంపేట వరంగల్, గూడూరు, కొత్తగూడకు, మానుకోట నుంచి కేసముద్రం, మానుకోట నుంచి నెల్లికుదురు, తొర్రూరుకు రాకపోకలు స్తంభించాయి. వాగులు, వంకలు జాతీయ రహదారిపై నుంచి పొంగిపొర్లడంతో పాటు చెరువులు మత్తళ్లు దూకడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మున్నేరువాగు పొంగడంతో మానుకోట–గూడూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాళ్ల వాగు ఉధృతితో మానుకోట–కేసముద్రం మధ్య పోలీసులు కొంతసమయం రాకపోకలను నిలిపివేశారు. అనంతరం వాహనాలను దగ్గర ఉండి జాగ్రత్తగా పంపించారు. జిల్లా కేంద్రం కురవి రోడ్డులోని బంధం చెరువులో నీటిమట్టం పెరిగి, ఆ చెరువు పక్కనే ఉన్న రోడ్డు కొంతభాగం కొట్టుకుపోయింది. అయితే రాకపోకలకు మాత్రం ఎలాంటి అంతరాయం కలగలేదు.
రెండోరోజు అప్రమత్తం..
వర్షాల నేపథ్యంలో కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు ఇటు రెవెన్యూ, అటు పోలీస్ అధికారులు, సిబ్బంది గురువారం ఉదయం 5 గంటల నుంచి వాగుల వద్ద బందోబస్తు నిర్వహించారు. మున్నేరువారు వద్ద టౌన్ సీఐ మహేందర్‌రెడ్డి, రాళ్లవాగు సమీపంలో పోలీస్ కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించారు.
 
							స్తంభించిన జనజీవనం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
