సేవా దృక్పథంతో పనిచేయాలి
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
మహబూబాబాద్ రూరల్ : పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ సేవా దృక్పథంతో పనిచేయాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సూచించారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ జిల్లా వ్యాప్తంగా నమోదైన క్రిమినల్ కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించి, పెండింగ్‌లో ఉన్న కేసులు, మహిళా భద్రత, సైబర్ నేరాలు, అక్రమ రవాణా, గంజాయి నియంత్రణ చర్యలు, ప్రజా, శాంతి భద్రత అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రతీ అధికారి నుంచి వారి పరిధిలోని కేసుల వివరాలు తెలుసుకొని, దర్యాప్తు వేగవంతం చేయాలని, న్యాయం జరిగేలా ప్రతీ కేసును శాసీ్త్రయ ఆధారాలతో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇటీవల జిల్లాలో రైతుల కోసం నిర్వహించిన యూరియా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా, ప్రశాంతంగా జరిగేలా కృషి చేసిన పోలీసు అధికారులను మెమొంటో, శాలువాలు కప్పి ప్రత్యేకంగా అభినందించారు. కోర్టు డ్యూటీలో అద్భుతంగా పనిచేసిన సీడీఓలకు ప్రశంసపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిశోర్, మోహన్, ఏఆర్ డీఎస్పీలు శ్రీనివాస్, విజయ్ ప్రతాప్, సీఐలు, ఎస్సైలు, వివిధ యూనిట్ల ఇన్‌చార్జ్ అధికారులు పాల్గొన్నారు.


