టెండర్ల దందా!
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్..
కూరగాయల మార్కెట్‌లో
వరంగల్: వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌లో వేలం(టెండర్)దందా జరుగుతోందనే ఆరోపణలు వి నిపిస్తున్నాయి. మా ర్కెట్‌లో వినాయకచవితి ఉత్సవాల నిర్వహణ, మార్కెట్‌లో మృతి చెందిన వ్యాపారులు, కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సా యం అందిస్తామన్న పేరుతో 20 సంవత్సరా లుగా వేలం(టెండర్) నిర్వహిస్తున్నారు. అయితే ఆ వేలంలో వచ్చిన ఆదాయాన్ని బాధితులకు అందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన వేలలో రూ.6.80లక్షలు సమకూరినప్పటికీ నేటికీ ఆర్థిక సాయం అందించకపోవడంతో పలువురు వ్యాపారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లోని కమీషన్ వ్యాపారులు ‘ది వరంగల్ సిటీ వెజిటబుల్ కమీషన్ ఏజెంట్స్ అసోసియేషన్’ పేరుతో 2005 ఆగస్టులో రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ చేయించిన కార్యవర్గం కనీసం పాన్‌కార్డు తీయకపోవడంతో బ్యాంకు అకౌంట్ తీసే అవకాశం కోల్పోయారు. దీంతో అసోసియేషన్ ఆదాయవ్యయాలు మొత్తం కార్యవర్గంలోని ఒకరిద్దరి చేతుల్లోనే జరిగాయి. మార్కెట్‌లో 2005నుంచి 2023 సంవత్సరం వరకు పెట్టిన టెండర్లతో సుమారు రూ.కోటిన్నర వరకు నిధులు సమకూరినట్లు వ్యాపారుల్లో చర్చ జరిగింది. దీనిపై కమీషన్ వర్తక సంఘం నాయకులు ఎప్పటికప్పుడు లెక్కలు చూస్తున్నామని చెప్ప డం.. వారికి రాజకీయంగా అండ ఉండడంతో మిగతా వ్యాపారులు నోరుమెదపలేకపోయారు. లెక్కలు కొంత మందికి తెలియడంతో మిగతా వ్యాపారులు ఇందులో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. గడిచిన 20ఏళ్లలో రెండు, మూడు కమిటీలు మారినప్పటికీ లెక్కలు ఏనాడు వర్తకసంఘంలోని సభ్యులకు చెప్పిన దాఖలాలు లేవు. ఈ విషయంలో స్పష్టత రాకపోవడంతో వ్యాపారులు బహిరంగంగా ఆరోపణలు చేశారు. చివరకు లెక్కలపై ఆరోపణలు తీవ్రం కావడంతో 2024జూలైలో కమీషన్ వ్యాపారుల సంఘం కార్యవర్గాన్ని రద్ద చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి కొత్తగా ఎన్నికలు పెడతామని ప్రకటించినా పలుమార్లు వాయిదా పడ్డాయి. దీనికి మారిన రాజకీయ సమీకరణలు సైతం కారణమని పలువురు పేర్కొంటున్నారు. తూర్పు ముఖ్య నేత మారడంతో అప్పుడు ఉన్న నాయకులు కొంత కాలం వేచి చూసి మార్గం సుగమం చేసుకున్నారు. చివరకు తాజాగా రద్దయిన కమిటీలో ఉన్న వారితోనే మళ్లీ ఇటీవల నూతన కార్యవర్గం ఏర్పాటు అయ్యింది. ప్రజాస్వామ్య పద్ధతిలో అసోసియేషన్ ఎన్నికలు జరపాలని మెజార్టీ వ్యాపారులు డిమాండ్ చేసినా అధికార పార్టీ నాయకుల అండతో పాత కమిటీ మళ్లీ కొత్తగా పురుడుపోసుకుంది.
కూరగాయల మార్కెట్‌లో వినాయకచవితి నిర్వహణతో పాటు మార్కెట్‌లో వ్యాపారం, హమాలీ పనులు చేస్తూ మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంటామని వేలం (టెండర్) పెట్టి వచ్చిన ఆదాయానికి 20 ఏళ్లుగా లెక్కలు చూపకపోవడంతో వ్యాపారులు ఆరోపణలు చేయడం, పత్రికల్లో కథనాలు ప్రచురితమవడం కలెక్టర్ దృష్టికి వచ్చింది. నిధుల వ్యయంపై స్పష్టత లేకపోవడం గమనించిన అప్పటి కలెక్టర్ ప్రావీణ్య టెండర్ మార్కెట్‌లో పెట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి టెండర్ జోలికి పోని వ్యాపారులు.. కొత్త కమిటీ రావడంతో మృతి చెందిన వారికి ఆర్థిక సాయం పేరుతో ఆగస్టు 26న వేలం (టెండర్)పెట్టారు. కలెక్టర్ ఆదేశాలకు విరుద్ధంగా వేలం పెట్టొద్దని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి నోటీసులు జారీ చేసినా పట్టించుకోలేదు.
గతంలో సమకూరిన నిధులెక్కడ
సంఘానికి అకౌంట్ లేదు..
లెక్కలు లేవు?
టెండర్ పెట్టొద్దనే కలెక్టర్
ఆదేశాలు బేఖాతర్
తాజాగా టెండర్ పెట్టినా నేటికీ
అందని ఆర్థిక సాయం
మరోసారి పెట్టేందుకు పావులు
కదుపుతున్న నాయకులు
రెండు నెలలైనా
సాయం ఏది?
వేలం(టెండర్)తో వచ్చిన ఆదాయాన్ని మార్కెట్‌లో మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సాయం రెండు నెలలైనా అందించలేదు. వచ్చిన ఆదాయంలో ఎంత మందికి ఎంతెంత అందిస్తారనే విషయం ఇప్పటి వరకూ గోప్యంగానే ఉంది. ఆర్థిక సాయం అందజేత విషయంపై వర్తక సంఘం బాధ్యులను అడిగితే మంత్రి సమయం తీసుకుని ఆర్థిక సాయం చెక్కులు బాధితులకు అందజేస్తారు అనే సమాధానం వస్తోంది. సంఘానికి బ్యాంకు అకౌంట్ లేకుండా చెక్కులు ఎలా ఇస్తారో వేచి చూడాల్సిందే. మళ్లీ త్వరలోనే మరోసారి వేలం (టెండర్)నిర్వహించేందుకు వర్తకసంఘం నాయకులు పావులు కదుపుతున్నట్లు సమాచారం.


