కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లు
కాజీపేట రూరల్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా చర్లపల్లి–బరౌని మధ్య రెండు ప్రత్యేక వీక్లీ రైళ్ల సర్వీస్‌లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ గురువారం తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు
ఈ నెల 25వ తేదీన చర్లపల్లి–బరౌని (07093) బరౌని ఎక్స్‌ప్రెస్ కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్తుంది. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన బరౌని–చర్లపల్లి( 07094) బరౌని ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో ప్రయాణించే ఈ ప్రత్యేక వీక్లీ రైళ్ల సర్వీస్‌లకు జనగామ, కాజీపేట, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్‌కాగజ్‌నగర్, బల్లార్షా, చాందా పోస్టు, గోండియా, దుర్గ్, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, జర్సుగూడ, రుర్కెలా, రాంచీ, మురి, బొకారో స్టీల్ సిటీ, ధన్‌బాద్, చిత్తరంజన్, మధుపూర్, జషిది రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు.
నేటి నుంచి ఇంటర్
కాలేజీయెట్ టోర్నమెంట్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్‌బోర్డు ఆధ్వర్యంలో ఈనెల 24నుంచి 26వ తేదీ వరకు ఇంటర్ కాలేజీయెట్ టోర్నమెంట్ (పురుషుల.. రెండోదశ) నిర్వహించనున్నట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య తెలిపారు. విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ బోర్డు ప్రాంగణంలో నిర్వహించే ఈ టోర్నమెంట్‌ను వీసీ కె. ప్రతాప్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. హ్యాండ్‌బాల్, సాఫ్ట్‌బాల్, బాల్‌బ్యాడ్మింటన్, ఖోఖో, క్రాస్‌కంట్రీ విభాగాల్లో పోటీలు కొనసాగుతాయని తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు.
ప్రైవేట్ టీచర్‌కు దేహశుద్ధి..
● విద్యార్థినులకు అసభ్యకర మెస్సేజ్‌లు
భూపాలపల్లి అర్బన్: విద్యార్థినులతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడి(పీఈటీ)కి తల్లిదండ్రులు, ఏబీవీపీ, భజరంగ్‌దళ్ కార్యకర్తలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏబీవీపీ, భజరంగ్‌దళ్ కార్యకర్తల కథనం ప్రకారం.. బాలాజీ ఇంటిగ్రేటెడ్ స్కూల్(బిట్స్) పాఠశాల పీఈటీ బానోత్ మోహన్ బాలికలకు సోషల్‌మీడియాలో అసభ్యకర మెస్సేజ్‌లు చేస్తున్నాడు. ఈ విషయం పలువురు విద్యార్థినుల తల్లిదండ్రులు ఏబీవీపీ, భజరంగ్‌దళ్ కార్యకర్తల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బుధవారం సాయంత్రం తల్లిదండ్రులతో కలిసి పాఠశాలకు చేరుకుని విద్యార్థుల ఎదుటే సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం ఉపాధ్యాయులపై తీరుపై విద్యార్థినులతో మాట్లాడి వారి అభిప్రాయాలను రాతపూర్వకంగా తీసుకున్నారు. మోహన్‌తో పాటు మరో ఉపాధ్యాయుడు కూడా బాలికల పట్ల అసభ్యకరంగా వ్యహరించడం, చనువుగా ఉంటూ సెల్‌ఫోన్‌లో వారి ఫొటోలు తీసుకున్నట్లు తెలిపారు. బాలికలకు ఇన్‌స్టాగ్రాంలో వచ్చిన మెస్సేజ్‌లు, ఫోన్‌లో మాట్లాడిన రికార్డులను పాఠశాల యాజమాన్యం, భూపాలపల్లి పీఎస్‌లో అందించారు. విద్యార్థినులతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపడుతున్నట్లు ఎస్సై సాంబమూర్తి తెలిపారు.
కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లు
కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లు


