ప్రైవేట్ స్కూల్‌లో మరో విద్యార్థి మృతి
నయీంనగర్: హనుమకొండ నయీంనగర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. యాజమాన్యమే కొట్టి చంపిందని మృతుడి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. నెలరోజుల క్రితం ఇదే పాఠశాలలో ఓ విద్యార్థి చనిపోవడం, తాజాగా మరో విద్యార్థి మృతి చెందడం కలకలం రేపింది. మృతుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన బానోత్ రమేశ్, సుజాత దంపతుల ఏకై క కుమారుడు సుజిత్ ప్రేమ్(9) క్లాస్ రూమ్‌లో కిందపడడంతో యాజమాన్యం స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. డాక్టర్లు పరీక్షించి విద్యార్థి బ్రెయిన్ డెడ్ కావడంతో చనిపోయాడని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. కానీ, తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడిని స్కూల్ యాజమాన్యమే కొట్టి చంపిందని, ఆరోగ్యంగా ఉన్న బాలుడు ఎలా చనిపోతాడని అనుమానం వ్యక్తం చేస్తూ స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. వీరికి విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. పాఠశాలలోని పూలకుండీలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. క్యాంపస్‌లో ఎలాంటి వసతులు లేకుండా 2,600 మంది విద్యార్థులకు ఎలా పర్మిషన్ ఇచ్చారని, గత నెల ఇదే స్కూల్‌లో మరణించిన విద్యార్థి తండ్రి ప్రశ్నించారు. విద్యాశాఖ అధికారుల పిల్లలు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుందని కన్నీటిపర్యంతమయ్యారు. స్కూల్‌లో అర్హత లేని పీఈటీని నియమించి మహిళలు, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఈటీ, పాఠశాల యాజమాన్యంపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులను ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.
నెల రోజుల క్రితం ఇదే పాఠశాలలో చనిపోయిన ఓ విద్యార్థి
మృతుల తల్లిదండ్రులు,
విద్యార్థి సంఘాల ఆందోళన
వరుస ఘటనలతో పాఠశాల
యాజమాన్యంపై ఆగ్రహం
ప్రైవేట్ స్కూల్‌లో మరో విద్యార్థి మృతి


