స్టీరింగ్‌పైనే ఆగిన శ్వాస..
దేవరుప్పుల: గుండెకు స్టంట్‌లు పడ్డాయి.. డ్రైవింగ్ చేయొద్దని వైద్యులు చెప్పినా కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా డ్రైవింగ్ వృత్తిని కొనసాగిస్తున్నాడు. అదే డ్రైవింగ్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో స్టీరింగ్‌పైనే ఒరిగిపోయాడు. ఈ దృశ్యం పలువురిని కంటతడి పెట్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన చిట్టిమెళ్ల వెంకన్న (50) డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు వివాహం చేశాడు. కుటుంబ ఆర్థిక స్థితిగతులను అధిగమించే క్రమంలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇప్పటికే మూడు పర్యాయాలు గుండెపోటుకు గురవగా స్టంట్‌లు వేశారు. అయినా కుటుంబ పోషణ కోసం ఎంత కష్టమైనా ఇదే వృత్తిలో కొనసాగుతున్నాడు. బుధవారం రాత్రి డీసీఎంలో పత్తి లోడ్‌తో జనగామకు చేరుకున్నాడు. తిరుగు ప్రయాణంలో సూర్యాపేట రహదారిలో దేవరుప్పుల మండల కార్యాలయాల వద్దకు రాగానే చాతిలో నొప్పిరావడంతో వెంకన్న డీసీఎంను రోడ్డు పక్కకు నిలిపాడు. ఇంజన్ ఆఫ్ చేయకుండానే తన సీట్లోనే విగతజీవిగా మారాడు. గురువారం తెల్లవారుజామున ఇదే రహదారిలో వాకర్స్ వెళ్లే క్రమంలో డీసీఎం ఇంజన్ రన్నింగ్‌లో ఉండడం, డ్రైవర్ అచేతన స్థితిలో కనిపించడంతో అనుమానం వచ్చి కదలించే ప్రయత్నం చేయడంతో చలనం రాలేదు. దీంతో డీసీఎంపై ఉన్న ఫోన్ నంబర్‌తో కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంకన్న భార్య భాగ్యలక్ష్మి , కుటుంబీకులు ఘటనాస్థలికి చేరుకుని బోరున విలపించారు. డ్రైవర్ వెంకన్న సమయస్ఫూర్తితో రోడ్డు పక్కన వాహనం నిలపడం వల్ల తెల్లవారుజామున వాహనాల రద్దీతో ప్రమాదాలు తప్పాయని స్థానికులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సృజన్‌కుమార్ తెలిపారు.
స్టంట్‌లు పడినా జీవన మనుగడ కోసం వీడని వృత్తి
ముందు చూపుతో రహదారిపై
తప్పిన ప్రమాదం


