కొనుగోళ్లు ఆలస్యం..
ప్రైవేట్ వ్యాపారులు సిద్ధం..
జిల్లాలో రైతుల ఇంటికి చేరుతున్న పత్తి
సాక్షి, మహబూబాబాద్: కష్టాలకోర్చి పత్తి పండిస్తే ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా కాటన్ కార్పొరేషన్ అఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయి. పత్తి తీసిన రైతులు ఇంట్లో ఆరబోస్తున్నారు. సీసీఐ కొనుగోళ్లు ప్రారంభిస్తే అమ్ముదామని ఎదురు చూస్తున్నారు. అయితే ఇదే అదునుగా ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు పత్తిని కొనేందుకు సిద్ధమవుతున్నారు.
రైతుల ఇంటికి పత్తి..
గత పదిహేను రోజులుగా జిల్లా వ్యాప్తంగా రైతులు పత్తిని తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది వానాకాలం జిల్లాలో మొత్తం అన్ని పంటలు కలిపి 3,59,775 ఎకరాల్లో సాగుచేశారు. ఇందులో 84,858 ఎకరాల్లో పత్తి పంట వేశారు. అయితే కలిసి రాని కాలంతో పత్తి దిగుబడి సగానికి పడిపోయింది. వేల ఎకరాలు ఎర్రబారడంతో దున్ని మొక్కజొన్న వేశారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎకరాకు సగటున 7.25 క్వింటాళ్ల దిగబడి వస్తందని, ఈ లెక్కన మొత్తం 6,14,561 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. ఇందులో ఇప్పటికే రైతులు రెండు లక్షల క్వింటాళ్లకు పైగా తీసి ఆరబోసి అమ్మేందుకు సిద్ధంగా ఉన్నారు.
మరింత జాప్యం..
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 22 నుంచి సీసీఐ కొనుగోళ్ల ప్రారంభించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అదేశించినా.. జిల్లా అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. రైతులు మోసపోకుండా ఉండేందుకు ఈ ఏడాది నుంచే రైతులే స్లాట్ బుకింగ్ చేసుకొని అమ్ముకునే విధంగా కొత్తయాప్‌ను రూపొందించారు. ఇందుకు అనుగుణంగా జిల్లాలోని మరిపెడ, పడమటిగూడెం, పెద్దవంగర, మహబూబాబాద్, తొర్రూరు ప్రాంతంలో రెండు చొప్పున మొత్తం ఆరు జిన్నింగ్ మిల్లుల ద్వారా సీసీఐ కొనుగోళ్లు చేపడుతున్నట్లు తెలిపారు. అయితే స్లాట్ బుకింగ్‌లో భాగంగా రైతుల ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకంలోని విస్తీర్ణం వివరాలతోపాటు వ్యవసాయశాఖ అధికారులు క్రాప్ బుకింగ్ సందర్భంగా ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేశారనే అంశాలు పొందుపర్చాలి. అయితే దీనిని జిన్నింగ్ మిల్లుల యజమానులు యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని, వ్యవసాయశాఖ వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవాలి. కానీ ఇప్పటి వరకు ఇన్‌స్టాల్ చేసుకోలేదు. పత్తి కొనేందుకు ఏర్పాట్లు ప్రారంభించలేదు.
సీసీఐ కొనుగోళ్లు ఆలస్యం చేయడంతో ఇదే అదునుగా ప్రైవేట్ వ్యాపారులు, చిల్లర వ్యాపారులు ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభించారు. సీసీఐ ద్వారా 8 నుంచి 12శాతం వరకు ఉన్న పత్తిని క్వింటాకు రూ.8,111 పెట్టి కొనుగోలు చేస్తారు. అదే ప్రైవేట్ వ్యాపారులు రకరకాల సాకులు చెప్పి తూకంలో మోసం చేసి క్వింటాకు రూ.5 వేల నుంచి రూ. 6వేల వరకు ధర పెట్టి కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ కొనుగోళ్లు త్వరగా ప్రారంభిస్తే ప్రైవేట్ వ్యాపారుల దోపిడీకి గురికాకుండా రైతులను కాపాడవచ్చని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు.
కొత్త నిబంధనలతో
కొనుగోళ్లలో జాప్యం
ఇప్పటి వరకు సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయని జిన్నింగ్ మిల్లులు
ఆలస్యం చేస్తే ప్రైవేట్ వ్యాపారులకు పండుగ
కొనుగోళ్లు ఆలస్యం..


