ఏజెన్సీ మండలాల సమగ్రాభివృద్ధే లక్ష్యం
కొత్తగూడ: కొత్తగూడ, గంగారం మండలాల సమగ్రాభివృద్ధే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని పంచాయతీరాజ్, సీ్త్ర,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. బుధవారం మండలంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మండల కేంద్రంలో నాలుగు లైన్ల రోడ్డు, సెంట్రల్ లైటింగ్, 30 పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పాకాల నుంచి కొత్తగూడ, గంగారం మండలాల్లో రెండు పంటలకు సాగు నీరు అందించే విధంగా ప్రణాళికలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధిని కొందరు వ్యక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పదేళ్లు అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి చేయని వా రు, ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్ర హీనులు అవుతారని హెచ్చరించారు. అనంతరం ఐటీడీఏ గెస్ట్ హౌస్‌లో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం పొగుళ్లపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. తిమ్మాపూర్‌లో సబ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సవ్ టొప్పో, ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్, డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.
కొమురం భీం పోరాటమే స్ఫూర్తి..
గిరిజనులు స్వేచ్ఛగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నారంటే కొమురం భీం లాంటి యోధుల పోరాటాల ఫలితమేనని మంత్రి సీతక్క అన్నారు. కొమురం భీం జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆదివాసీ కుల సంఘాల నాయకులు, ఆదివాసీ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మంత్రి ధనసరి సీతక్క


