
వైద్యులు స్థానికంగా ఉండాలి
● డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్
గార్ల: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు పీహెచ్‌సీ వైద్యులు, వైద్య సిబ్బంది స్థానికంగా ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ ఆదేశించారు. బుధవారం మండలంలోని ముల్కనూరు పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత వైద్య సిబ్బంది హాజరు పట్టిక, రికార్డులను పరిశీలించారు. పీహెచ్‌సీలో డెలివరీల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. గర్భిణుల డెలివరీల సంఖ్య పెంచాలని, నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని సూచించారు. వైద్య సిబ్బంది విధుల్లో సమయపాలన పాటించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం గార్లలోని సబ్‌సెంటర్లను తనిఖీ చేశారు. వ్యాక్సినేషన్‌ను సమయం ప్రకారం చిన్నపిల్లలకు చేయాలని సూచించారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ఫీవర్ సర్వే చేసి, జ్వరపీడితులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఏఎన్‌ఎంలను ఆదేశించారు,. డాక్టర్ శివకుమార్, సీహెచ్‌ఓ సక్కుబాయి, హెచ్‌ఎస్ ఇస్మాయిల్ బేగ్, వైద్య సిబ్బంది లలిత తదితరులు పాల్గొన్నారు.