
విద్యుదాఘాతంతో జీపీ కార్మికుడి మృతి
వెంకటాపురం(కె): విద్యుదాఘాతంతో ఓ జీపీ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం బీసీ మర్రిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బీసీ మర్రిగూడెం గ్రామపంచాయతీ కార్మికుడు విజయ్(33) శుక్రవారం శాంతినగర్‌లోని ప్రభుత్వ పాఠశాలో ఫ్యాన్ బిగిస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన గ్రామస్తులు విజయ్‌ను వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కుటుంబ కలహాలతో
వ్యక్తి ఆత్మహత్య
జఫర్‌గఢ్: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి.. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం తీగారంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, ఎస్సై రామ్‌చరణ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ముక్కమాల భిక్షపతి (55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల వరి నారు విక్రయించిన విషయంలో దంపతుల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. దీంతో భిక్షపతి అప్పటి నుంచి వ్యవసాయ బావి వద్దే ఉంటున్నాడు. ఈక్రమంలో మనస్తాపానికి గురైన భిక్షపతి.. శుక్రవారం వ్యవసాయ బావి వద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామ్‌చరణ్ తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
కిడ్నాపర్ల కోసం
ఒడిశాకు పోలీసు బృందం
గీసుకొండ : మండలంలోని ధర్మారం బస్టాండ్ సమీపంలో గురువారం సాయంత్రం కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులోని కై టెక్స్ కంపెనీలో పని చేస్తున్న వివాహిత రింకిమల్లి కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. కిడ్నాపర్లు ముందు రెక్కీ నిర్వహించి ప్లాన్‌తో సదరు వివాహితను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కారులో వచ్చి కిడ్నాప్ చేసిన అనంతరం దుండగులు నర్సంపేట వైపునకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే కిడ్నాప్‌నకు పాల్పడి వారు సదరు వివాహితభర్తతో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులే అని పోలీసులు నిర్ధారించారు. వారి ఆచూకీ కోసం ఎస్సై కూడిన పోలీసు బృందాన్ని శుక్రవారం ప్రత్యేకంగా ఒడిశాకు పంపించినట్లు గీసుకొండ సీఐ మహేందర్ తెలిపారు. ఇదిలా ఉండగా.. రింకిమల్లి విషయంలో కై టెక్స్ కంపెనీ ప్రతినిధులు ఆమె ఆచూకీ కోసం పలుమార్లు సెల్‌ఫోన్ ద్వారా ప్రయత్నించగా ఆమె వారితో మాట్లాడి తన భర్తే తనను తీసుకుని వెళ్తున్నాడని, ఇందులో కిడ్నాప్ ఏమీ లేదని రింకిమల్లి బదులిచ్చినట్లు సమాచారం. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత అసలు విషయం తెలిసే అవకాశం ఉంది.

విద్యుదాఘాతంతో జీపీ కార్మికుడి మృతి