
రామప్ప నుంచి లక్నవరానికి నీటి కాల్వ
గోవిందరావుపేట: రామప్ప నుంచి లక్నవరం వరకు నీటి కాల్వ ఏర్పాటు చేస్తామని, తద్వారా రైతులకు ఏడాదిలో రెండు పంటలకూ నీరు అందే అవకాశం ఉంటుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మండలంలోని లక్నవరం సరస్సు నీటిని కలెక్టర్ దివాకర టీఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణితో కలిసి పంట కాల్వ లకు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సాగునీటి వనరుల విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందన్నారు. గ్రామాల అభివృద్ధికి కాకతీయులు చెరువులు తవ్వించి సాగు, తాగునీరు అందించేవారన్నారు. వారి స్ఫూర్తితోనే గ్రామీణాభివృద్ధికి ప్రణాళికతో పని చేస్తున్నామన్నారు. చెరువులో నీరు ఉంటే గ్రామం పచ్చగా ఉంటుందని, అదే స్ఫూర్తితో రైతులకు నీటి కొరత లేకుండా పని చేస్తున్నామన్నారు. రైతు సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ నారాయణ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
● తద్వారా రెండు పంటలకూ సాగు నీరు
● రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క