
పంచుకున్నదెవరు?
అన్‌యూజ్డ్ పోస్టుల కన్వర్షన్‌కు ఖర్చులవుతాయని వసూళ్లు..
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్‌లో ఏళ్లుగా అన్‌యూజ్డ్‌గా ఉన్న పోస్టులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసి కొత్త పోస్టులను క్రియేట్ చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త పోస్టులతో ప్రయోజనం చేకూరుతుందని ఆశ చూపి కొందరు వసూళ్లకు పాల్పడినట్లు విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో ఉన్నత స్థాయి పోస్టుకు పదోన్నతిలో ఉన్న ఓ అసోసియేషన్ నాయకుడు కీలకంగా వ్యవహరించినట్లు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా అన్ యూజ్డ్‌గా ఉన్న వర్క్‌మెన్ క్యాడర్‌కు చెందిన 216 పోస్టులను వినియోగంలోకి తీసుకురావాలని విద్యుత్ ఉద్యోగ సంఘాలు యాజమాన్యానికి మూడేళ్లుగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో సీఎండీగా వరుణ్ రెడ్డి స్వీకరించిన తర్వాత సంస్థ అవసరాల దృష్ట్యా అన్ యూజ్డ్‌గా ఉన్న 216 పోస్టులతోపాటు ఖాళీగా ఉంటున్న 217 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను రద్దు చేస్తూ నూతనంగా 339 పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదనలు పరిశీలించిన ప్రభుత్వం 339 పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులను సంస్థ అవసరాల మేరకు వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు విభాగాలు, సర్కిళ్లు, డివిజన్లు, సబ్ డివిజన్ల వారీగా టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం కేటాయించింది.
వసూళ్లకు తెర..
అన్ యూజ్డ్ పోస్టులు రద్దు, నూతన పోస్టుల మంజూరుకు సెక్రటేరియట్‌లో ఖర్చులు ఉంటాయని చెప్పి, పోస్టులు పెరిగితే లబ్ధి చేకూరే ఆశావహుల నుంచి కొంత ఎక్కువ మొత్తంలో, పోస్టులు పెరుగకున్నా పదోన్నతి లభించే మిగతా వారి నుంచి తక్కువ మొత్తంలో వసూళ్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వీరికి తోడు కొన్ని అసోసియేషన్లు కూడా కొంత మొత్తం ముట్టజెప్పినట్లు తెలిసింది. పోస్టులు పెరిగితే తనకు పదోన్నతి వచ్చే అవకాశమున్న ఓ అసోసియేషన్ నాయకుడు ఈ వసూళ్లలో కీలకంగా వ్యవహరించినట్లు విద్యుత్ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. రూ.లక్షల్లో వసూళ్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పోస్టులు మంజూరై వచ్చిన తర్వాత ఎలాంటి ఖర్చులు కాలేదని తెలియడంతో డబ్బులు ముట్టజెప్పిన వారు అవాక్కయ్యారు. వాస్తవంగా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఈ వ్యవహారంలో ఎక్కడా అవినీతి, ఖర్చులకు ఆస్కారముండదు. అయితే అక్రమ సంపాదనకు అలవాటుపడిన కొన్ని అసోసియేషన్ల నాయకులు కొత్త పోస్టుల మంజూరుకు ఖర్చులవుతాయని దుష్ప్రచారం చేసి వసూళ్లకు పాల్పడడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వసూళ్ల దందాపై పలు యూనియన్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పోస్టుల మంజూరులో ఎక్కడా రూపాయి కూడా ఖర్చు లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే వసూళ్లు చేసిన సొమ్ము ఎవరెవరు పంచుకున్నారని విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
పదోన్నతిలో ఉన్న ఇంజనీర్ల నుంచి రూ.లక్షల్లో సేకరణ
ఓ అసోసియేషన్ నేత కీలకంగా వ్యవహరించినట్లు చర్చ
ఖర్చులకు ఆస్కారం లేదంటున్న టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం
మూడేళ్ల క్రితం అన్‌యూజ్డ్ పోస్టులను వినియోగంలోకి తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు యాజమాన్యానికి వినతి పత్రం అందించాయి. అయితే ఇందులో వర్క్‌మెన్ పోస్టులతో పాటు ఇంజనీరు, అకౌంటెంట్, పర్సనల్ ఆఫీసర్ పోస్టులు కావాలని ఆయా విభాగాల అసోసియేషన్ల నేతలు కోరారు. 216 అన్‌యూజ్డ్ పోస్టులను వర్క్‌మెన్ పోస్టులుగా వినియోగంలోకి తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు పట్టుదలతో ఉన్నాయని, ఇంజనీర్‌తో పాటు ఇతర పోస్టులు మంజూరు చేయాలంటే యూనియన్ నాయకులను మచ్చిక చేసుకోవాలని, దీనికి ఖర్చులవుతాయని, అప్పట్లో ఏడీఈ నుంచి డీఈ పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు ప్రచారం జరిగింది. డీఈ పదోన్నతి కోసం ఎదురుచూసిన ఇంజనీర్లు కొందరు రిటైర్డ్ అయ్యారు. వారు రిటైర్డ్ అయిన కొన్ని రోజులకే పదోన్నతి కల్పించారు. దీంతో వీరి వద్ద నుంచి వసూలు చేసిన సొమ్ము న్యాయంగా తిరిగి చెల్లించాలి. కానీ తీసుకున్న మొత్తం కాకుండా కొంత మాత్రమే తిరిగి చెల్లించారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ రిటైర్డ్ ఇంజనీర్ తెలిపారు. ఇలా రెండు పర్యాయాలు వసూళ్లు చేసిన సొమ్ము ఎవరి చేతుల్లోకి వెళ్లిందని? ఎవరు కాజేశారని విద్యుత్ ఉద్యోగులు ఆరా తీస్తున్నారు. అయితే అన్ యూజ్డ్ పోస్టులను వినియోగంలోకి తీసుకురావాలని కోరామని, తాము ఎవరి నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించలేదని కొన్ని విద్యుత్ ఉద్యోగ సంఘాలకు చెందిన నాయకులు స్పష్టం చేశారు. మరో వైపు వసూళ్లు చేసింది ఎవరు.. ఆ సొమ్ము ఎవరి చేతుల్లోకి వెళ్లిందనే అంశంపై యాజమాన్యం దృష్టి సారించినట్లు తెలిసింది.

పంచుకున్నదెవరు?