
విద్యుత్ అంతరాయాలు తగ్గాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
హన్మకొండ: విద్యుత్ అంతరాయాలు తగ్గాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్‌ఈ, డీఈ, ఏడీఈ, ఏఈ, ఎస్‌ఏఓ, ఏఏఓలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్కిల్, డివిజన్ల వారీగా ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ 16 సర్కిళ్ల పరిధిలో ముందుగా వేయి ఫాల్ట్ ప్యాసెజ్ ఇండికేటర్లు 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో ఉండే పొడవాటి లైన్లలో అమర్చుతున్నట్లు తెలిపారు. తద్వారా విద్యుత్ అంతరాయాలను త్వరగా గుర్తించి పరిష్కరించనున్నట్లు వివరించారు. ఈ నెలలో 30 సబ్‌స్టేషన్లలో, వచ్చే నెలలో 120 సబ్ స్టేషన్లలో రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ పూర్తి చేయాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న లూజు లైన్‌లు, వంగిన స్తంభాలు, తుప్పు పట్టిన స్తంభాలు, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల గద్దెలు, లైన్ క్రాసింగ్, డబుల్ ఫీడింగ్‌ను గుర్తించి ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. ఈ నెలాఖరు వరకు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందించే లైన్ల పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ ఇంజనీర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, కె.తిరుమల్ రావు, రాజు చౌహన్, అశోక్, వెంకట రమణ, ఆర్.చరణ్ దాస్, జనరల్ మేనేజర్లు వేణుబాబు, కృష్ణ మోహన్, వాసుదేవ్, సత్యనారాయణ, అన్నపూర్ణ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.