
ప్రాణహిత పరవళ్లు
కాళేశ్వరం: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత వరద కాళేశ్వరం వద్ద గోదావరితో కలిసి నాలుగు రోజులుగా ఉగ్రరూపం దాల్చుతూ ఉప్పొంగి ప్రవహిస్తోంది. తెలంగాణలో అంతగా వర్షాలు లేకపోవడంతో గోదావరిలో అంతగా నీరు లేదు. మహారాష్ట్ర ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 11.790 మీటర్ల ఎత్తులో నీటిమట్టం దిగువకు ప్రవహిస్తోంది. త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన రెండు జ్ఞానదీపాలు నీటమునిగి కొంతమేర మాత్రమే పైకి కనిపిస్తున్నాయి. రాత్రివరకు పూర్తి స్థాయిలో మునిగిపోనున్నాయి. దిగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీకి వరద ప్రవాహం 8.68 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రూపంలో వచ్చి చేరుతుండగా, 85గేట్లు ఎత్తివేయడంతో అదే స్థాయిలో నీటిని దిగువకు ఇంజనీరింగ్ అధికారులు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలోని గోసిపుర్డ్ డ్యామ్ నీరు వదలడంతో రాత్రి వరకు మరింత వరద నీరు చేరుతుందని తెలిసింది.
కాళేశ్వరం ఘాట్ వద్ద
11.790 మీటర్ల నీటిమట్టం
మేడిగడ్డ బ్యారేజీ వద్ద 8.68 లక్షల క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లో