
శాసనసభ ఏర్పాటు చేసే దమ్ముందా..?
హన్మకొండ: ప్రతిపక్ష పార్టీ లేఖ రాస్తే శాసనసభ ఏర్పాటు చేసే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ప్రశ్నించారు. రాజకీయాల్లో అనేకమంది ముఖ్యమంత్రులను చూశానని, రేవంత్ రెడ్డిని చూస్తే... మాట మార్చడం, మడమ తిప్పడం, ఏ మార్చడం ఆయన నీతి, రీతిగా కనిపిస్తుందన్నారు. గురువారం హనుమకొండలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. శాసనసభ సమావేశాలకు ఒక తంతు ఉంటుందన్నారు. ప్రభుత్వం గవర్నర్‌కు సమావేశ తేదీ వివరాలలో లేఖ పంపాల్సి ఉంటుందన్నారు. గవర్నర్ ఆమోదంతో సమావేశాలు నిర్వహిస్తారన్నారు. శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామంటే లేఖ రాయడానికి సిద్ధమన్నారు. మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించడం కాదన్నారు. ప్రెస్ క్లబ్‌ను ఇతర క్లబ్‌లతో పోల్చడం నిరంకుశత్వమన్నారు. పార్టీలు మారినప్పుడు ప్రెస్‌క్లబ్‌కు వెళ్లి మాట్లాడలేదా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఎన్నికలకు పోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, చెప్పులు క్యూలో పెడుతూ నిరీక్షిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2 లక్షల జాబ్ క్యాలండర్ ఎటు పోయిందని నిలదీశారు. సమావేశంలో నాయకులు మర్రి యాదవ రెడ్డి, చింతం సదానందం, పులి రజనీకాంత్, జోరిక రమేశ్, నయీముద్దీన్, రామ్మూర్తి పాల్గొన్నారు.
సభా సమావేశానికి
ఒక తంతు ఉంటుంది
మండలి ప్రతిపక్ష నేత సిరికొండ
మధుసూదనాచారి