వ్యాపారుల ఇష్టారాజ్యం!
మహబూబాబాద్: పశు వధశాలలు లేకపోవడంతో మాంసం విక్రయాదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా పశు వధశాలల్లో గొర్రెలు, మేకలు ఆరోగ్యంగా ఉంటేనే వధించేందుకు పశువైద్యాధికారి అనుమతి ఇస్తారు. కాగా జిల్లాలోని మున్సిపాలిటీల్లో పశు వధశాలలు లేకపోవడంతో పలువురు వ్యాపారులు చనిపోయినవి, అనారోగ్యంతో ఉన్న వాటిని వధించి విక్రయిస్తున్నారనే ఆరోపణ లు వస్తున్నారు. కాగా పన్ను వసూలు చేసేందు కు మాత్రం కమేళా వేలం నిర్వహిస్తున్న మున్సిపాలిటీలు.. ప్రజల ఆరోగ్యాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐదు మున్సిపాలిటీల్లో కానరాని
పశు వధశాలలు..
జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు మానుకోట, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రంలో పశువధశాలలు లేవు. కాగా మానుకోట మున్సిపాలిటీగా ఏర్పడకముందే.. గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో సుమారు 40ఏళ్ల క్రితం పశువధశాల నిర్మించి వ్యాపారాలు నిర్వహించారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు మూత పడింది. మరిపెడ మున్సిపాలిటీ పరిధి పశు సంత సమీపంలో పశువధశాల ఉన్నప్పటికీ అది మూతపడింది. ఇలా జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ప్రస్తుతం పశువధశాలలు లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా, అధిక ధరలకు మాంసం విక్రయాలు జరుపుతున్నారు. కిలో మాంసం ధర రూ.1000 కాగా, బోన్‌లెస్ మటన్ ధర రూ.1200 వరకు విక్రయిస్తున్నారు.
వధశాల ఉంటే..
పశువధశాల ఉంటే.. అందులో పశువైద్యాధికారి పరీక్షలు నిర్వహించి జీవాలు ఆరోగ్యంగా ఉంటేనే కోసేందుకు అనుమతి ఇస్తారు. స్లాటరీ, సర్టిఫై చేసి, స్టాంప్ వేసిన తర్వాత మాంసం విక్రయించే అవకాశం ఉంటుంది. ఇలా ఆరోగ్యవంతమైన జీవాల మాంసం కొనుగోలు చేసిన ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు.
ఎలాంటి నిబంధనలు లేకుండానే..
వ్యాపారులు తక్కువ ధరలకు వయస్సు మీదపడిన, అనారోగ్యంతో ఉన్న మేకలు, గొర్రెలు కోనుగోలు చేసి వాటిని వధించి విక్రయాలు చేస్తున్నారు. షాపుల వద్ద కనీస పరిశుభ్రత పాటించడం లేదు. అక్కడ సరైన నీటి వసతి కూడా ఉండడం లేదు. బకెట్‌లో నీళ్లు తెచ్చుకుని దానిలో కడిగి వ్యర్థాలు కూడా అక్కడే వేస్తున్నారు. దుర్గంధం వెదజల్లడంతో పాటు ఈగలు వాలుతున్న మాంసం వికయ్రిస్తున్నారు. కొంత మంది ఎక్కడో కోసుకుని వచ్చి మాంసం మాత్రం రోడ్లపై పెట్టి విక్రయిస్తున్నారు. అది ఏ జంతువు మాంసం అనేది తెలియకుండానే ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారంగా భావిస్తున్నారే తప్ప ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు.
స్థలాల కేటాయింపు పరిశీలనకే పరిమితం..
మానుకోట మున్సిపాలిటీలతో పాటు మిగిలిన మున్సిపాలిటీల్లో పశువధశాలల ఏర్పాటుకు స్థలా ల పరిశీలన చేశారు. కానీ నేటి వరకు స్థలాల కేటా యింపు జరగలేదని అధికారులు తెలిపారు. వధ శాలల ఏర్పాటుపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లాలో కానరాని పశు వధశాలలు
విచ్చలవిడిగా మాంసం విక్రయాలు
చనిపోయిన, అనారోగ్యంతో
ఉన్న జీవాలను వధిస్తున్నట్లు ఆరోపణలు


