ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దు
మహబూబాబాద్: ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ ల్యాండ్స్, ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు ఎలా అనుమతులు ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు. ప్రజల కోసం వినియోగించాల్సిన గ్రీన్ ల్యాండ్స్, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికావడం దారుణమన్నారు. మానుకోట నియోజకవర్గం అభివృద్ధి పథకంలో పరుగులు పెడుతున్న క్రమంలో కొంతమంది అధికారుల తీరు తలనొప్పిగా మారిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కారులో నిరుపేదలకు ఇళ్లు, పేదలకు సన్నబియ్యం, ఉచిత విద్యుత్‌తో పాటు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జిని తక్షణమే నిర్మించాలని ఆదేశించారు. విధుల్లో ఎవరైనా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో కమిషనర్ టి.రాజేశ్వర్, డీఈ సీహెచ్ ఉపేందర్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్


