
అల్లుడిని కత్తితో పొడిచి చంపిన మామ
కేసముద్రం: కుటుంబ కలహాల కారణంగా ఓ అల్లుడిని కత్తితో పొడిచి మామ హత్య చేసిన ఘటన మండలంలోని ధర్మారంతండా జీపీలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన లూనావత్ బాల(35) హైదరాబాద్‌లోని లింగంపల్లిలో వాటర్ టాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కేసముద్రం మండలం ధర్మారంతండా జీపీకి చెందిన బానోత్ వీరన్న, కై లా దంపతుల కుమార్తె మౌనికతో 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో భార్యభర్తల మధ్య గొడవలు కాగా 3 రోజుల క్రితం మౌనిక తల్లిగారింటికి వచ్చింది. తన భార్యను తీసుకెళ్లేందుకు బాల శనివారం ధర్మారంతండాకు వచ్చాడు. మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మామ వీరన్న క్షణికావేశంలో కత్తితో అల్లుడి ఛాతిపై పొడిచాడు. బాలను స్థానికులు మానుకోట జనరల్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్‌రాజ్ పరీశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.